మృత్యువులోనూ వీడని బంధం
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:59 AM
పెళ్లి రోజు సందర్భంగా స్నేహితుడి కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి బయలుదేరిన ఆ దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం
రెండు జంటలు సహా మొత్తం ఐదుగురి కన్నుమూత
మృతులు సంగివలస, మధురవాడ, భీమిలి వాసులు
భోగాపురం వద్ద రహదారి పక్కన ఆపి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొన్న జీపు
తగరపువలస, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి):
పెళ్లి రోజు సందర్భంగా స్నేహితుడి కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి బయలుదేరిన ఆ దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. జాతీయ రహదారిపై శ్రీకాకుళం జిల్లా భోగాపురం సమీపంలోని సుందరపేట వద్ద మంగళవారం ఉదయం ఏడు గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు (దంపతులు) సంగివలస, మరో ఇద్దరు (దంపతులు) మధురవాడ, ఇంకొకరు భీమిలికి చెందినవారు.
జీవీఎంసీ రెండో వార్డు పరిధి సంగివలసకు చెందిన బొర్రా సతీష్ (36), శ్రుతి (30)కి పన్నెండేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి కుమార్తె ధన్యశ్రీ (7), కుమారుడు దర్శిత్ (4) ఉన్నారు. సతీష్ సంగివలసలో చాలాకాలంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం పెళ్లిరోజు కావడంతో ఏటా మాదిరిగానే శ్రీముఖలింగేశ్వరుడిని దర్శించుకుని, తర్వాత ఇంట్లో వేడుక జరుపుకోవాలని భావించారు. అందుకోసం సతీష్ తన స్నేహితుడైన మధురవాడకు చెందిన వాకలపూడి శ్రీను (36), కుసుమ రంజని (29) దంపతులను ఆహ్వానించారు. స్నేహితుడైన భీమిలి సమీపంలోని డెక్కతిపాలేనికి చెందిన కొండపు సూరిబాబును వాహనం నడిపేందుకు శ్రీను తమతోపాటు సోమవారం రాత్రి సతీష్ ఇంటికి తీసుకువెళ్లారు. సతీష్ దంపతులతోపాటు శ్రీను దంపతులు, సూరిబాబు కలిసి మహీంద్రా థార్ జీపులో మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు శ్రీముఖలింగం వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఇంటి వద్ద బయలుదేరినప్పుడు, దర్శనం తర్వాత ఆలయం వద్ద తీసుకున్న ఫొటోలను సూరిబాబు ఉదయం 6.15 గంటల సమయంలో వాట్సాప్ స్టాటస్‌గా పెట్టుకున్నారు. అయితే ఇంటికి తిరిగి వస్తుండగా సుమారు ఏడున్నర గంటల సమయంలో సుందరపేట వద్ద జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్‌ను వీరి వాహనం బలంగా ఢీకొట్టడంతో సతీష్ భార్య శ్రుతి, శ్రీను దంపతులతోపాటు సూరిబాబు అక్కడికక్కడే మృతిచెందారు. సతీష్ తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉండడంతో హుటాహుటిన సంగివలస సమీపంలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్సపొందుతూ సతీష్ మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ సార్వజన ఆస్పత్రికి తరలించారు.
మృత్యువులోనూ వీడని స్నేహం
సతీష్, మధురవాడకు చెందిన వాకలపూడి శ్రీను చిన్ననాటి స్నేహితులు. సతీష్ తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా, శ్రీను విశాఖలో రిలయన్స్ స్టోర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇరు కుటుంబాలవారు తరచూ కలుసుకుంటుంటారు. ఈ క్రమంలోనే సతీష్ ఆహ్వానం మేరకు శ్రీను మంగళవారం సెలవు పెట్టుకుని భార్యతో శ్రీముఖలింగం బయలుదేరారు. తనతో పాటు పనిచేస్తున్న కొండపు సూరిబాబును డ్రైవింగ్ కోసం తీసుకువెళ్లారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఆగి ఉన్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నట్టు విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ అభిప్రాయపడ్డారు.
అనాధలైన పిల్లలు
మృతిచెందిన బొర్రా సతీష్ శ్రుతి దంపతులకు ఇద్దరు పిల్లలు...కుమార్తె ధన్యశ్రీ (7) కొడుకు దర్శిత్ (4). దేవాలయానికి వెళ్లి ఉదయం పది గంటలకల్లా తిరిగి ఇంటికి వచ్చేస్తామన్న ఆలోచనలో పిల్లలిద్దరినీ తమ్ముడు సురేష్ వద్ద వదిలిపెట్టారు. కాగా శ్రీను దంపతులకు వివాహమై 14 ఏళ్లు అయింది. వారికి కూడా కుమారుడు, కుమార్తె ఉన్నారు. సూరిబాబు భార్య పేరు గౌరి. వారికి 15 ఏళ్ల కుమార్తె, పదేళ్ల కుమారుడు ఉన్నారు. ప్రమాదం విషయం తెలియగానే సంగివలసలో విషాద ఛాయలు అలముకున్నాయి. వివాద రహితునిగా పేరున్న సతీష్ మృతిచెందారన్న విషయాన్ని చాలామంది నమ్మలేకపోతున్నారు.
అర్ధరాత్రి మొదలైన ప్రయాణం...ఉదయాన్నే విషాదం
ఫ బొర్రా సతీష్ దంపతులు, వాకలపూడి శ్రీను దంపతులు, సూరిబాబు కలిసి సోమవారం అర్ధరాత్రి 12-12.30 గంటల మధ్య థార్ జీపులో తగరపువలస నుంచి శ్రీముఖలింగం బయలుదేరారు.
ఫ తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో నాతవలస టోల్‌గేట్ దాటారు. అక్కడి నుంచి రెండున్నర నుంచి మూడు గంటల ప్రయాణం అనంతరం శ్రీముఖలింగం చేరుకున్నారు. శివుడిని దర్శించుకుని, ఆలయ ప్రాంగణంలో ఫొటోలు దిగారు. వాటిని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
ఫ తెల్లవారుజామున 4-4.40 గంటల మధ్య విశాఖపట్నానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో అల్పాహారం తీసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఫ ఉదయం 7.20 గంటలకు భోగాపురం మండలం సుంకరిపేట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను వారి జీపు బలంగా ఢీకొంది. ఆ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.