మృత్యువులోనూ వీడని బంధం
ABN , Publish Date - Mar 13 , 2026 | 01:05 AM
నగరంలో ఒకేరోజు జరిగిన రెండు సంఘటనలు ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాదం నింపాయి.
ఆస్పత్రిలో తల్లి కష్టం చూడలేక కొడుకు...
కాసేపటికే తిరిగిరాని లోకాలకు తల్లి
గుండెపోటుతో భర్త మృత్యువాత
తట్టుకోలేక ప్రాణం విడిచిన భార్య
ఒకేరోజు నగరంలో రెండు సంఘటనలు
నగరంలో ఒకేరోజు జరిగిన రెండు సంఘటనలు ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాదం నింపాయి. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తల్లి కష్టాన్ని చూడలేక మనోవేదనతో కొడుకు కుప్పకూలిపోగా, కాసేపటికే ఆ తల్లి కూడా తిరిగిరాని లోకాలకు తరలిపోయింది. అలాగే ఏయూ రిటైర్డ్ ఉద్యోగి బుధవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో మృత్యువాత పడగా, భర్త మృతదేహం వద్ద రోదిస్తూ గురువారం ఉదయం భార్య ప్రాణాలు విడిచారు.
తల్లి కష్టం చూడలేక...
గోపాలపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి కష్టాన్ని తట్టుకోలేక కుమారుడు కుప్పకూలిపోగా, కాసేపటికే ఆ తల్లి కూడా తిరిగిరాని లోకాలకు తరలిపోయింది. ఈ విషాద ఘటన గురువారం కేజీహెచ్‌లో జరిగింది. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం గ్రామం నాగేంద్రకాలనీకి చెందిన కాళ్ల లక్ష్మమ్మ (65) కుమారుడు కాళ్ల గంగరాజు (41), కోడలితో కలిసి నివసిస్తోంది. లక్ష్మమ్మ ఇటీవల అనారోగ్యానికి గురవడంతో కేజీహెచ్‌లో చేర్పించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కుమారుడు గంగరాజు ఆస్పతిలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లాడు. అత్యంత ఆందోళనకరంగా ఉన్న తల్లి పరిస్థితిని చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కొద్దిసేపు తల్లి వద్ద ఉండి బయటకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందాడు. గంగరాజు మృతదేహాన్ని అతడి బంధువులు ఇంటికి తీసుకువచ్చారు. ఆ తరువాత కొద్ది నిమిషాలకే లక్ష్మమ్మ కూడా మృతిచెందినట్టు సమాచారం అందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఒకేసారి తల్లీ, కుమారుల మృతి గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. మృత్యువులోనూ పేగు బంధం వీడలేదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా గురువారం మధ్యాహ్నం లక్ష్మమ్మ, గంగరాజు మృతదేహాలకు నిర్వహించిన అంతిమ యాత్రలో గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. గంగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భర్త మరణం తట్టుకోలేక....
నక్కపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
ఆ దంపతులను మృత్యువు కూడా వేరుచేయలేకపోయింది. భర్త మరణించిన కొద్ది గంటల్లోనే మృతదేహం వద్ద విలపిస్తూ భార్య తనువు చాలించింది. ఈ విషాద ఘటన పెదవాల్తేరులో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన షేక్ ఖాసీం (67), భార్య అలీమా బీబీ (58) విశాఖలో నివాసముంటున్నారు. ఖాసీం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసి సుమారు ఎనిమిదేళ్ల కిందట రిటైరయ్యారు. నగరంలోని పెదవాల్తేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఖాసీంకు బుధవారం రాత్రి 10-30 గంటలకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందారు. భర్త హఠాన్మరణాన్ని అలీమా బీబీ జీర్ణించుకోలేకపోయారు. భర్త మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తూ గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ప్రాణాలు విడిచారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. మృత్యువులోనూ వారి వివాహ బంధం వీడిపోలేదని, ఒకరి వెంట మరొకరు తిరిగిరాని లోకాలకు తరలిపోయారని విలపించారు. గంటల వ్యవధిలోనే మృత్యుఒడికి చేరిన దంపతుల మృతదేహాలకు పెదవాల్తేరు ఖబరస్తాన్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. దంపతుల మృతి వారి స్వగ్రామమైన సీతారాంపురంలో విషాదం నింపింది.