పచ్చదనంపై వేటు!
ABN , Publish Date - Jul 16 , 2026 | 01:17 AM
నగరంలో పచ్చని చెట్లను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దుకాణాలకు, నిర్మాణాలకు అడ్డుగా ఉన్నాయని ఎవరికి వారే చెట్లను తొలగించేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. అక్రమంగా చెట్లను నరికివేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారులు ఎందుచేతనో చోద్యం చూస్తున్నారు. వాటిని ప్రూనింగ్ చేయాల్సిన పని లేకుండా తప్పించుకోవడానికి జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారులే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
నగరంలో విచ్చలవిడిగా చెట్ల నరికివేత
దుకాణాలు, నిర్మాణాలకు
అడ్డుగా ఉన్నాయని తొలగిస్తున్న వైనం
పర్యావరణానికి తీవ్ర విఘాతం
ప్రూనింగ్ చేయాల్సి వస్తుందని
పెద్దచెట్లను నరికేస్తున్నారనే ఆరోపణలు
చోద్యంచూస్తున్న జీవీఎంసీ హార్టికల్చర్ అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో పచ్చని చెట్లను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దుకాణాలకు, నిర్మాణాలకు అడ్డుగా ఉన్నాయని ఎవరికి వారే చెట్లను తొలగించేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. అక్రమంగా చెట్లను నరికివేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారులు ఎందుచేతనో చోద్యం చూస్తున్నారు. వాటిని ప్రూనింగ్ చేయాల్సిన పని లేకుండా తప్పించుకోవడానికి జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారులే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు జీవీఎంసీలో ప్రత్యేకంగా హార్టికల్చర్ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఆ విభాగం నగరంలో మొక్కలు, చెట్లను పరిరక్షించడంతోపాటు రహదారులకు ఇరువైపులా, సెంటర్ మీడియన్లపైన అందమైన నీడనిచ్చే మొక్కలను పెంచాలి. ఎవరైనా మొక్కలు లేదా చెట్లను తొలగించినా, నరికివేసినా గుర్తించి జరిమానా విధించడంతోపాటు కొత్తగా వారితో మొక్కలను నాటించి వాటి పరిరక్షించే బాధ్యతను కూడా అప్పగించాలి. ఎక్కువమొక్కలను తొలగించినా, చెట్లను నరికినా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసి క్రిమినల్ చర్యలు తీసుకునేలా చూడాలి. కానీ నగరంలో దశాబ్దానికి పైగా వయస్సు కలిగిన పచ్చని చెట్లను దుకాణాలకు అడ్డుగా ఉన్నాయని, తమ నిర్మాణాలకు అడ్డంగా ఉన్నాయని రాత్రిపూట తొలగించేస్తున్నారు. రోడ్లు డివైడర్లపై అందంగా కనిపించే చెట్లను సైతం నరికేస్తున్నారు. బీచ్‌రోడ్డులో గాదిరాజు ప్యాలెస్ సమీపాన సెంటర్ మీడియన్‌పై ఉన్న చెట్లను కొన్నాళ్ల కిందట గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. అదేవిధంగా ఆటోమోటివ్ జంక్షన్‌లో ఒక స్పోర్ట్స్ దుకాణానికి అడ్డుగా ఉన్నాయని కొన్ని చెట్లను నరికేశారు. తాజాగా అప్పుఘర్ జంక్షన్ నుంచి కైలాసగిరి రోప్‌వే వరకూ సెంటర్ మీడియన్‌లో ఉన్న చెట్లను నరికేయడం చర్చనీయాంశంగా మారింది. వీధి దీపాలకు అడ్డంగా ఉన్నా, రోడ్డుపైకి కొమ్మలు వచ్చేశాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే శాస్త్రీయ పద్ధతిలో కట్ చేయాల్సి ఉంటుంది. అలాకాకుండా కాండం మాత్రమే వదిలి మిగిలిన చెట్టంతా కొట్టేశారు. దీనిపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చెట్ల కొట్టివేతపై జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారులను వివరణ కోరగా తమ అనుమతి లేకుండానే చెట్లను నరికేశారన్నారు. చెట్ల నరికివేత విచ్చలవిడిగా జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని, దీనివెనుక హార్టికల్చర్ విభాగం సిబ్బంది అండదండలు ఉన్నాయనే ఆరోపణలను ప్రస్తావించగా, అలాంటివారు ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరడం గమనార్హం.