Share News

సమగ్ర శిక్షలో వింత పోకడ!

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:53 AM

జిల్లా సమగ్ర శిక్ష విభాగంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సామగ్రి కొనుగోళ్లలో అవకతవకలు, కేజీబీవీల్లో టెండర్ల ఖరారులో తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యాలయం సూపరింటెండెంట్‌కు పదోన్నతి కల్పించి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.

సమగ్ర శిక్షలో వింత పోకడ!
సమగ్ర శిక్ష కార్యాలయం

- ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగికి పదోన్నతి కల్పించి బదిలీ

- ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లా సమగ్ర శిక్ష విభాగంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సామగ్రి కొనుగోళ్లలో అవకతవకలు, కేజీబీవీల్లో టెండర్ల ఖరారులో తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యాలయం సూపరింటెండెంట్‌కు పదోన్నతి కల్పించి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. సంబంధిత ఉద్యోగిపై గతంలో పలు ఆరోపణలు వచ్చినప్పటికీ, వాటిపై స్పష్టమైన విచారణ లేకుండానే పదోన్నతి కల్పించడంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విమర్శలు గుప్పిస్తున్నారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేస్తున్న సదరు సూపరింటెండెంట్‌ కార్యాలయానికి అవసరమైన ఏసీలు కొనుగోలు వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపించాయి. అంతే కాకుండా విఽధి నిర్వహణలో సమయపాలన పాటించకపోవడం, నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారనే అభియోగాలు ఉన్నాయి. వివిధ పనులపై మండలాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తారనే విమర్శలున్నాయి. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై శాఖాపరమైన విచారణ పూర్తికాకముందే విద్యాశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టరుగా (ఏడీగా) పదోన్నతిపై శ్రీకాకుళం బదిలీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఉద్యోగ వర్గ్గాలు పేర్కొంటున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, పదోన్నతి ఇవ్వడం ద్వారా ఎలాంటి సందేశం వెళుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయనపై గతంలో అందిన ఫిర్యాదులు బుట్టదాఖలేనా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ స్పందించి సదరు ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jul 05 , 2026 | 12:53 AM