సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:55 AM
తల్లిదండ్రులకు దూరంగా గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో వుంటూ చదువుకుంటున్న విద్యార్థులకు మరింత మెరుగైన పోషకాహారం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మెస్ (డైట్) చార్జీలను పది శాతం పెంచాలని బుధవారం అమరావతిలో జరిగిన సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనివల్ల జిల్లాలో వేలాది మంది విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం, అల్పాహారం అందే అవకాశం వుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రధానంగా బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.
గురుకులాలు, వసతిగృహాల్లో విద్యార్థుల డైట్ చార్జీలు పది శాతం పెంపు
ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం
చోడవరం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులకు దూరంగా గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో వుంటూ చదువుకుంటున్న విద్యార్థులకు మరింత మెరుగైన పోషకాహారం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మెస్ (డైట్) చార్జీలను పది శాతం పెంచాలని బుధవారం అమరావతిలో జరిగిన సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనివల్ల జిల్లాలో వేలాది మంది విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం, అల్పాహారం అందే అవకాశం వుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రధానంగా బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.
జిల్లాలో నక్కపల్లి, కొక్కిరాపల్లి, తాళ్లపాలెం, సబ్బవరం, దేవరాపల్లి, కోనాం, వేములపూడి, గొలుగొండల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకుల కళాశాలలు వున్నాయి. వీటిల్లో ఈ ఏడాది సుమారు 4,500 మంది బాలబాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకుల కళాశాల/ పాఠశాలలు వున్నాయి. వీటిల్లో మూడు వేల మంది వరకు విద్యార్థులు వున్నారు. మాడుగుల, చీడికాడ మండలాల్లో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన మూడు ఆశ్రమోన్నత పాఠశాలలు వున్నాయి. వీటిల్లో 1,500 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పట్టణాలు, మండలాల్లో వసతిగృహాలు వున్నాయి. ఉన్నత పాఠశాలలకు దూరంగా వున్న గ్రామాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ వసతిగృహాల్లో వుంటూ, సమీపంలోని పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరికి తరగతుల వారీగా మెస్ చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తున్నది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్, ఇతర ముడిసరుకుల ధరలు పెరగడంతో ఆ ప్రభావం అన్ని రకాల వస్తువులపై పడి ధరలు పెరిగాయి. వసతిగృహాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న డైట్ చార్జీలతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో పోషకాహారాన్ని అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఆయా సంక్షేమ శాఖల అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మెస్ చార్జీలను పది శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన చార్జీలను ఈ నెల నుంచే అమలు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో 3, 4 తరగతుల విద్యార్థులకు నెలకు రూ.1,150 చొప్పున డైట్ చార్జీల కింద ప్రభుత్వం చెల్లిస్తున్నది. పది శాతం పెంపుతో ఇది రూ.1,265కు పెరుగుతుంది. 5 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,400 చొప్పున చెల్లిస్తుండగా, ఈ నెల నుంచి రూ.1,540 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంటర్, డిగ్రీ, ఆపై విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రస్తుతం రూ.1,600 ఇస్తుండగా, ఇది రూ.1,760కి పెరుగుతుంది. మూడేళ్ల తరువాత డైట్ చార్జీలు పెరగడంతో వసతిగృహాలు, గురుకుల పాఠశాలల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.