Share News

చిరుధాన్యాల సాగుకు పెద్దపీట

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:08 AM

గిరిజన ప్రాంతంలో చిరుధాన్యాల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గురువారం వ్యవసాయశాఖ మార్కెట్‌ యార్డులో మెగా రాగి మేళాను నిర్వహించారు. ఏడీఏ బీవీ తిరుమలరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆళ్ల అప్పలస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో చిరుధాన్యాల ఉత్పత్తికి కేవలం గిరిజన ప్రాంతం మాత్రమే అత్యంత అనుకూలమన్నారు.

చిరుధాన్యాల సాగుకు పెద్దపీట
రైతు సదస్సులో మాట్లాడుతున్న ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి, వేదికపై ఏడీఏ తిరుమలరావు

- సేంద్రీయ పద్ధతిలో రాగి ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలి

- అందుబాటులోకి రానున్న మేలిరకం వంగడాలు

- ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి

చింతపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో చిరుధాన్యాల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గురువారం వ్యవసాయశాఖ మార్కెట్‌ యార్డులో మెగా రాగి మేళాను నిర్వహించారు. ఏడీఏ బీవీ తిరుమలరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆళ్ల అప్పలస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో చిరుధాన్యాల ఉత్పత్తికి కేవలం గిరిజన ప్రాంతం మాత్రమే అత్యంత అనుకూలమన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి అవసరమైన చిరుధాన్యాలు గిరిజన ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతాయని చెప్పారు. గతంలో ఆదివాసీలు రాగి, కొర్ర, సామ, జొన్నలను సాగు చేసేవారన్నారు. కాలక్రమేణా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. చిరుధాన్యాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు వ్యవసాయశాఖ కృషి చేస్తున్నదన్నారు. ఆర్గానిక్‌ పద్ధతిలో రాగి సాగును ప్రోత్సహిస్తుందని చెప్పారు. గతంతో పోల్చుకుంటే రాగిలో దిగుబడి శాతం రెండేళ్లగా గణనీయంగా పెరిగిందన్నారు. గిరిజన రైతులకు మేలిరకం రాగి వంగడాలను అందించేందుకు పరిశోధనలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఇంద్రావతి, చంపావతి, భారతి, శ్రీచైతన్య, తెల్లరాగులు(హిమ) సువర్ణముఖి రకాలను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. గిరిజన రైతులు దీర్ఘకాలిక రకాలను విడిచిపెట్టి స్వల్పకాల రకాలను సాగు చేసుకోవాలని సూచించారు. రైతులు ఆధునిక యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు. గులి, జమున పద్ధతిలో సాగు చేసుకోవాలన్నారు. రైతులు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను పూర్తిగా విడిచిపెట్టాలన్నారు. రైతులకు సేంద్రీయ ఎరువులను ప్రభుత్వం అందుబాటులోకి తీసకొచ్చిందన్నారు. ఏడీఏ బీవీ తిరుమలరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంత రైతులకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తుందన్నారు. రాజ్‌మా విత్తనాలను 90 శాతం రాయితీపై అందిస్తుందని చెప్పారు. ఈ ఏడాది రాజ్‌మా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. దీంతో రైతుల ఆదాయం రెట్టింపు అయిందన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం సుఖీభవ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. రాయితీపై యంత్రపరికరాలు అందజేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని చెప్పారు. రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే రాయితీపై వ్యవసాయ యంత్రాలు అందజేస్తారన్నారు. అనంతరం రాయితీ యంత్రాలు, వినియోగంపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలకు వివరించారు. మేళాలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాలు, సేంద్రీయ ఎరువులు, యంత్రాల స్టాళ్లను గిరిజన రైతులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి టి.మఽధుసూదనరావు, ఎంపీపీ కోరాబు అనుషదేవి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ కిల్లో ఊర్మిళ, వైస్‌ చైర్మన్‌ హశ్వంత్‌, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి గెమ్మెలి అబ్బాయినాయుడు, టీడీపీ మండలాధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు, ఏఎంసీ డైరెక్టర్లు పెదిరెడ్ల బేతాళుడు, చెన్నకేశ్వరనాయుడు, ఈశ్వరమ్మ, పీఏసీఎస్‌ కార్యదర్శి జగన్మోహన్‌రావు, శాస్త్రవేత్తలు సందీప్‌ నాయక్‌, జోగారావు , కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 01:08 AM