అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:32 AM
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
- జిల్లాలో వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతికి సమ ప్రాధాన్యం
- ఇప్పటికే రూ.4,166.48 కోట్ల పెట్టుబడులతో 9 పరిశ్రమల ఏర్పాటు
- 8,685 మందికి ఉపాధి
- మరో రూ.2.87 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న 39 భారీ పరిశ్రమలు
- స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి అనిత
అనకాపల్లి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి, ప్రగతి నివేదికను వివరించారు. జిల్లాలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో పీఎం కిసాన్‌తో కలిపి జిల్లాలో 2.42 లక్షల రైతు కుటుంబాలకు రూ.158.04 కోట్లు అందించామన్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా జిల్లాలో 2.01 లక్షల మంది లబ్ధిదారులకు రూ.301.71 కోట్లు , ఎన్టీఆర్ భరోసా పథకం కింద 2.51 లక్షల మందికి పింఛన్లుగా రూ.107.15 కోట్లు, స్త్రీశక్తి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 201.68 లక్షల మంది మహిళలు, బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. దీనికి రూ.68.42 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జిల్లాలో మత్స్యకారుల సేవలో పథకం కింద రూ.25.32, ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద రూ.20.63 కోట్లు చెల్లించామన్నారు. పల్లె పండుగ 2.0 కింద రూ.101.7 కోట్లతో 197.20 కిలోమీటర్ల సీసీ రోడ్లు, రూ.5.11 కోట్లతో 10.33 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.691 కోట్లతో నీటి సరఫరా పనులు జరుగుతున్నాయన్నారు.
అన్ని రంగాలకు ప్రాధాన్యం
అన్ని రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధ్యానం ఇస్తోందని మంత్రి అనిత తెలిపారు. రైతులకు 18,730 క్వింటాళ్ల నాణ్యమైన పచ్చిరొట్ట విత్తనాలు, వరి విత్తనాలు రూ.2.53 కోట్ల రాయితీతో 39,500 మందికి పంపిణీ చేశామన్నారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు రూ.9.82 కోట్లతో 3,850 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు, ఆయిల్‌పామ్, తోటల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు. ప్యాక్ హౌస్‌లు, శీతల గిడ్డంగులు, పుట్టగొడుగు, ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు పంటకోత అనంతర నష్టాల తగ్గింపు, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరతను అధిగమించేందుకు పీఎండీఎస్, డ్రిప్ ఇరిగేషన్, వీడ్ మ్యాట్స్, ఫార్మ్ పాండ్స్ వంటి నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహిస్తూ, ఉద్యాన పంటల ఉత్పాదకతను కాపాడేందుకు ఉద్యాన శాఖ ద్వారా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా వీబీ జీరామ్‌జీ పథకం కింద 2.45 లక్షల మందికి 90.8 లక్షల పనిదినాలు కల్పించి రూ.256.81 కోట్లు వేతనాలుగా అందించామన్నారు. 116 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసి 171 ఖాళీలను భర్తీ చేశామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎస్టీ విద్యార్థులకు రూ.1.06 కోట్లు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేశామన్నారు. బీసీ సేవా సహకార సంఘం ద్వారా జిల్లాలో 2,268 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా 1,426 పాఠశాలలు, కళాశాలల్లో 93,438 మంది విద్యార్థులకు రూ.30.70 కోట్లతో భోజన పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా 4,370 మందికి రూ.9.06 కోట్లతో వైద్య సహాయం, జననీ సురక్ష ద్వారా 5,758 మందికి రూ.46.14 లక్షలు అందజేశామన్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా 2,492 మంది బాలింతలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఆధునిక వైద్య సేవలతో పాటు రూ.22.25 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ సిద్ధమవుతోందని తెలిపారు.
పారిశ్రామిక కేంద్రంగా జిల్లా
జిల్లా గ్రీన్ ఎనర్జీ, స్టీల్, ఫార్మా, డేటా సెంటర్లు, టాయ్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు ప్రధాన కేంద్రంగా మారనుందని మంత్రి తెలిపారు. ఏఎంఎన్‌ఎస్ స్టీల్ 17.8 ఎంటీపీఏ సామర్థ్యంతో రాజయ్యపేటలో రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడులతో సుమారు లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు మార్గం సుగమం కానున్నదన్నారు. రాంబిల్లిలో రూ.5,400 కోట్లతో రెన్యూ సౌర ప్రాజెక్టు ఏర్పాటు చేసి 2,100 ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. నక్కపల్లిలో రూ.1,867.66 కోట్లతో 2,001.8 ఎకరాల్లో బల్క్‌డ్రగ్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. నక్కపల్లిలో రూ.582 ఎకరాల్లో గ్లోబల్ టాయ్‌పార్క్ ఏర్పాటు కానున్నదని, జిల్లాలో రూ.85,200 కోట్లతో గ్రీన్ డేటా సెంటర్లు ఏర్పాటు చేసి 1,880 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో రూ.4,166.48 కోట్ల పెట్టుబడులతో 9 పరిశ్రమలు ఏర్పాటు చేసి 8,685 మందికి ఉపాధి కల్పించామన్నారు. మరో రూ.2,87,000 కోట్ల పెట్టుబడులతో 39 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు డీఆర్‌డీఏ ద్వారా 41,878 మందికి బ్యాంకుల నుంచి రూ.610.96 కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ.183.81 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. ఉన్నతి పథకం ద్వారా 704 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.4.26 కోట్ల వడ్డీలేని రుణాలు, సామాజిక పెట్టుబడి నిధి ద్వారా 6,217 మందికి రూ.38.98 కోట్లు మంజూరు చేశామన్నారు.
ఆకట్టుకున్న అభివృద్ధి శకటాలు
స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయా శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా మొత్తం 16 శకటాలను ఏర్పాటు చేసి ప్రదర్శించారు. మొదటి బహుమతిని రెండు శకటాలు సంయుక్తంగా గెలుచుకున్నాయి. ఇందులో జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ, అనకాపల్లి శకటం పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబిస్తూ ఆకట్టుకోగా, పీడీ డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ శకటం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించింది. రెండో బహుమతి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్‌డీఏ) స్వయం ఏపీ శకటంతో పాటు డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ అండ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ (సురక్షిత కార్మికులు-సుస్థిర పారిశ్రామిక ప్రగతి) శకటాలకు దక్కాయి. మూడో బహుమతి వ్యవసాయశాఖ అనుబంధ ప్రకృతి వ్యవసాయం, కార్పొరేషన్, డిస్ట్రిక్ట్ హార్టీకల్చర్ శకటానికి వచ్చింది. అలాగే జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, ఉద్యోగులు, ఈ విద్యాసంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొత్తం 560 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
జిల్లాలోని 12 పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తిని చాటే గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్రథమ బహుమతిని తానాం ఎంజేఏపీ బీసీఆర్ స్కూల్ విద్యార్థులు దక్కించుకున్నారు. ద్వితీయ బహుమతి ‘పాడవోయి భారతీయుడా’ గీతానికి మినీ గురుకులం ఏపీఆర్‌ఎస్, నక్కపల్లి విద్యార్థులకు దక్కింది. మూడో బహుమతి ఐసీడీఎస్ కశింకోట విద్యార్థులు అందుకున్నారు. విజేతలకు అధికారులు బహుమతులు అందజేసి అభినందించారు. ప్రత్యేక బహుమతి సరుగుడు గ్రామానికి చెందిన కోలాటం, ధింసా కళాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, జేసీ శౌర్యమాన్ పటేల్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ చైౖర్మన్ బత్తుల తాతయ్యబాబు, అర్బన్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, గవర సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్‌పర్సన్ కోట్ని బాలాజీ, డీఆర్‌వో సత్యనారాయణరావు, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.