Share News

పర్యాటకానికి పెద్దపీట!

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:43 PM

ఆంధ్రా ఊటీగా పేరుగాంచి పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతున్న అరకులోయ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

పర్యాటకానికి పెద్దపీట!
హుకుంపేట మండలం సీతమ్మకొండపై ట్రెక్కింగ్‌ చేస్తున్న సాహసికులు (ఫైల్‌)

అరకులోయలో ట్రెక్కింగ్‌ ట్రైల్స్‌ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో స్థానం

ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌

ఇప్పటికే అరకులోయ మండలం గాలికొండ,

హుకుంపేట మండలం అరమలో ఔత్సాహికులు ట్రెక్కింగ్‌

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఆంధ్రా ఊటీగా పేరుగాంచి పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతున్న అరకులోయ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొండలు కోనలున్న అరకులోయ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ ట్రైల్స్‌ అభివృద్ధికి కృషి చేస్తామని ఆదివారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ స్వయంగా ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో అరకులోయలో ట్రెక్కింగ్‌ ట్రైల్స్‌ అభివృద్ధిపై ప్రస్తావించడం విశేషం.

సాహస క్రీడల అభివృద్ధికి దోహదం

మన్యంలో ఇన్నాళ్లుగా ప్రకృతి అందాలపైనే ఆధారపడి పర్యాటకం కొనసాగుతున్నది. ఇకపై ఇక్కడున్న కొండలు, కోనలను సైతం సందర్శకులకు సరికొత్తగా చూపించి పర్యాటకంగా అభివృద్ధికి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ట్రెక్కింగ్‌ అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే ఏజెన్సీలో అరకులోయ మండలం గాలికొండ, సుంకరమెట్ట ప్రాంతాల్లో, హుకుంపేట మండలం అరమకొండ (సీతమ్మకొండ) ప్రాంతానికి వివిధ ప్రాంతాలకు చెందిన వారు వచ్చి ట్రెక్కింగ్‌ అనుభూతిని పొందుతున్నారు. అయితే పర్యాటకుల వ్యక్తిగత ఆసక్తి మేరకు మాత్రమే ఇన్నాళ్లుగా ఏజెన్సీలో ట్రెక్కింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. దీంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి, ఉపాధి, ఆదాయం వంటివి లేని పరిస్థితి నెలకొంది. కాని కేంద్ర ప్రభుత్వం అరకులోయ కేంద్రంగా ట్రెక్కింగ్‌ ట్రైల్స్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టేందుకు ముందుకు రావడంతో రానున్న రోజుల్లో అరకులోయ ప్రాంతం సాహస క్రీడలకు వేదికగా మారేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని పర్యాటకులు, క్రీడాకారులు అంటున్నారు.

ట్రెక్కింగ్‌ ట్రైల్స్‌ అభివృద్ధితో ఏమి జరుగుతోంది..

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ట్రెక్కింగ్‌ ట్రైల్స్‌ అభివృద్ధితో ఇప్పటికే అరకులోయ ప్రాంతాల్లో ప్రకృతి అందాలను తిలకించేందుకు వస్తున్న సందర్శకులకు కొండలు, అడవులు, లోయలు, జలపాతాలు, మారుమూల గ్రామాల మధ్యగా వెళుతూ ప్రకృతితో మరింతగా మమేకమయ్యే అనుభూతిని కలిగిస్తుంది. దీంతో ఇన్నాళ్లుగా దూరం నుంచి చూస్తున్న అడవులు, లోయలు, కొండ కోనల వద్దకు స్వయంగా నడుచుకుంటూ వెళ్లే అవకాశం కలుగుతుంది. యువత, ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉన్న దేశ, విదేశీయ పర్యాటకులను సైతం అరకులోయ ప్రాంతం ఆకర్షిస్తున్నది. గైడ్లుగా, స్థానిక ఆహారాలను అందించేందుకు, హోమ్‌స్టే, రవాణా సేవలు, హస్తకళల వస్తువుల విక్రయం ద్వారా స్థానికులకు ఉపాధి ఆదాయం లభిస్తుందని భావిస్తున్నారు. అలాగే ట్రెక్కింగ్‌ ట్రైల్స్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అరకులోయ ప్రాంతాన్నే ఎంపిక చేసేందుకు గల కారణాలను పరిశీలిస్తే.. ఈప్రాంతంలో కొండలు, లోయలు, జలపాతాలు, కాఫీ తోటలతో ప్రకృతి అందాలు ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో పాటు పర్యాటకంగా గుర్తింపు పొంద డమేనని తెలుస్తున్నది. కేంద్ర బడ్జెట్‌ ప్రస్తావనలో అరకులోయ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యతనీయడం పట్ల ఈ ప్రాంతీయులు, పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 01 , 2026 | 11:43 PM