Share News

అందాల జలపాతం.. వెళ్లాలంటే కష్టం

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:42 AM

మండలంలోని పర్యాటక ప్రాంతమైన యర్రవరం జలపాతానికి వెళ్లేందుకు పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రహదారి నిర్మాణానికి రూ.2 కోట్ల వీబీ జీరామ్‌జీ నిధులను విడుదల చేసింది.

అందాల జలపాతం.. వెళ్లాలంటే కష్టం
వర్షాలకు ఉరకలేస్తున్న యర్రవరం జలపాతం

- వర్షాలకు కోతకు గురైన యర్రవరం రహదారి

- రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

- ఏడాది క్రితం నిలిచిపోయిన పనులు

- పర్యాటకులు, స్థానిక గిరిజనులకు తప్పని అవస్థలు

- నెల రోజుల్లో ప్రారంభంకానున్న పర్యాటక సీజన్‌

చింతపల్లి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని పర్యాటక ప్రాంతమైన యర్రవరం జలపాతానికి వెళ్లేందుకు పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రహదారి నిర్మాణానికి రూ.2 కోట్ల వీబీ జీరామ్‌జీ నిధులను విడుదల చేసింది. నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్‌ ఎర్తు వర్కు పూర్తి చేసి వెట్‌మిక్స్‌ వేశారు. అయితే ఏడాది కాలంగా పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. ఆ తరువాత కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డు కోతకు గురైంది. మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్‌ ప్రారంభంకానుంది. ఈలోగా ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ పరిధిలో యర్రవరం జలపాతం ఉంది. ఈ జలపాతానికి తురబాడుగెడ్డ నుంచి సమగిరి మీదుగా వెళ్లాలి. ఈ మార్గానికి ఆనుకుని సుమారు 12 గ్రామాలు ఉన్నాయి. తురబాడుగెడ్డ నుంచి సమగిరి వరకు తారురోడ్డు ఉంది. సమగిరి నుంచి యర్రవరం జలపాతం వరకు వెళ్లేందుకు కేవలం మట్టిరోడ్డు మాత్రమే ఉండేది. దీంతో ఈ మార్గంపై కేవలం ద్విచక్రవాహనాలు మినహా ఆటోలు, కార్లు, జీపులు వెళ్లే పరిస్థితి లేదు. ఈ ప్రాంత ఆదివాసీలు సైతం కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. శీతాకాల సీజన్‌లో ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి వచ్చే పర్యాటకులు అధిక సంఖ్యలో యర్రవరం జలపాతాన్ని సందర్శిస్తుంటారు. పర్యాటకులు సమగిరి వరకు కార్లు, జీపుల్లో వచ్చి అక్కడ నుంచి కాలినడకన జలపాతానికి వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ మార్గం బురదమయమైపోతుంది. కనీసం ద్విచక్రవాహనాలు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. యర్రవరం జలపాతానికి రహదారి లేకపోవడం వల్ల ఆదివాసీలు, పర్యాటకులు ఎదుర్కొంటున్న సమస్యలను గత వైసీపీ పాలకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికి కనీసం స్పందించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక టూరిజం ప్రాజెక్టులో భాగంగా సమగిరి నుంచి యర్రవరం జలపాతం వరకు నాలుగు కిలోమీటర్లు తారురోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. ఈ మార్గంలో నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్‌ సుమారు ఎనిమిది కల్వర్టులను నిర్మించారు. ఎర్తు వర్కు పూర్తి చేశారు. అయితే రహదారి నిర్మిస్తున్న భూమి కొంత భాగం అటవీశాఖ పరిధిలో ఉండడంతో అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఏడాది క్రితం పనులను కాంట్రాక్టర్‌ నిలిపివేశారు. అటవీశాఖ నిర్మాణాలకు అభ్యంతరాలను తొలగిస్తూ అనుమతులు మంజూరు చేసి నెలలు గడిచిపోతున్నప్పటికి పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు నిర్మాణ పనులు పునఃప్రారంభించలేదు.

ప్రమాదబరితంగా రహదారి

భారీ వర్షాలకు నిర్మాణ దశలో ఉన్న యర్రవరం జలపాతం రహదారి కోతకు గురైంది. రహదారిపై నిర్మించిన వెట్‌మిక్స్‌ పలు చోట్ల కొట్టుకుపోయింది. రహదారిపై పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. ద్విచక్ర వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. కార్లు, జీపులు సైతం ఇటుగా వెళ్లడానికి ఇబ్బంది తప్పడం లేదు. ఈ రహదారిపై ప్రయాణించిన వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. ఈ మార్గంపై రాకపోకలు సాగించేందుకు స్థానిక గిరిజనులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

నెల రోజుల్లో పర్యాటక సీజన్‌ ప్రారంభం

నెల రోజుల్లో పర్యాటక సీజన్‌ ప్రారంభంకానుంది. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు వేల సంఖ్యలో పర్యాటకులు లంబసింగి సందర్శిస్తుంటారు. లంబసింగికి వచ్చిన పర్యాటకులు యర్రవరం జలపాతాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా కురిసిన వర్షాలకు జలపాతం ఉరకలేస్తూ సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ జలపాతానికి వెళ్లేందుకు రహదారి అత్యంత అధ్వానంగా ఉండడంతో పర్యాటకులు సందర్శనలను నిలిపివేసుకుంటున్నారు. తక్కువ మంది మాత్రమే కాలినడకన, ప్రైవేటు జీపుల్లో జలపాతానికి వస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు స్పందించి పర్యాటక సీజన్‌ ప్రారంభం నాటికి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని పర్యాటకులు, ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:42 AM