Share News

2 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందే!

ABN , Publish Date - May 25 , 2026 | 12:13 AM

జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘంలో ఒక నాయకుడి వ్యవహారశైలి తీవ్రవివాదాస్పదమవుతోంది.

2 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందే!

కాట్రాక్టర్లకు జీవీఎంసీ యూనియన్‌ నేత హుకుం

తక్షణం చెల్లించాలంటూ మెసేజ్‌లు

లాటరీలో పనులు కేటాయించేలా అధికారులకిచ్చామని లెక్కలు

చెల్లించకపోతే తర్వాత పనులు దక్కవని హెచ్చరిక

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘంలో ఒక నాయకుడి వ్యవహారశైలి తీవ్రవివాదాస్పదమవుతోంది. జీవీఎంసీ అభివృద్ధి పనులకు టెండర్లు వేయవద్దని, లాటరీ విధానంలో కాంట్రాక్టర్లకు వర్కులు కేటాయించిన సదరు నేత ఇప్పుడు కమీషన్‌లు ఇవ్వాలని హుకుం జారీచేస్తున్నారు. లాటరీ విధానంలో పనులను అనుమతించేందుకు అధికారులకు డబ్బులు ఖర్చుపెట్టానని, తక్షణం యూనియన్‌కు చెల్లించాలని మెసేజ్‌లు చేస్తున్నారు. కమీషన్‌ ఇవ్వకపోతే ఇబ్బందిపడేలా చేస్తానని హెచ్చరించడం చర్చనీయాంశమవుతోంది.

జీవీఎంసీ పరిధిలో సుమారు 430 మంది వరకు కాంట్రాక్టర్లు రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. వారిలో 250 మంది నిరంతరం ఏదో ఒక అభివృద్ధి పనిచేస్తుంటారు. జీవీఎంసీ ఏదైనా అభివృద్ధిపని చేయాలనుకుంటే ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలుస్తుంది. అర్హులైన కాంట్రాక్టర్లు బిడ్‌లు దాఖలు చేస్తే ఎవరు ఎక్కువ లెస్‌కు వేస్తే వారికి టెండర్‌ను ఖరారుచేసి అగ్రిమెంట్‌ చేసుకుంటారు. దీనివల్ల జీవీఎంసీకి లెస్‌లరూపంలో డబ్బు ఆదా అవడంతోపాటు ఎక్కువ లెస్‌కు టెండర్‌ వేసినవారికి పారదర్శకంగా పనులు దక్కుతాయి.

ఆ నేతదే హవా

జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘంలో మొదటిసారి పదవి దక్కించుకున్న ఒకరు ఇంజనీరింగ్‌, ఫైనాన్స్‌ విభాగంలోని ముఖ్య అధికారులను గుప్పిట్లో పెట్టుకుని, తాజాగా కాంట్రాక్టర్లను తన అదుపాజ్ఞలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే టెండర్లలో ఎవరికివారు బిడ్‌లు వేయవద్దని, అందరూ ఏకాభిప్రాయంతో లాటరీ ద్వారా పనులు పంచుకుంటే అధిక లాభాలు వస్తాయని హితబోధ చేశారు. లాటరీలో ఎంపికైన వ్యక్తి మాత్రమే ఒకటి, రెండు శాతం మించకుండా లెస్‌కు బిడ్‌ చేసి, మరొకరు, లేదా ఇద్దరితో మరింత తక్కువ లెస్‌కు బిడ్‌ వేసి అనుకున్న వ్యక్తికే టెండరు దక్కేలా చేయడం ప్రారంభించారు. అయితే సదరు నేత తన బంధువులు, అస్మదీయులైన వారికి మంచి పనులు దక్కేలా చేస్తున్నారంటూ కొందరు కాంట్రాక్టర్లు బహిరంగంగానే ఆరోపించడంతో పాటు లాటరీ విధానానికి తాము వ్యతిరేకమని ప్రకటించారు. అలాంటివారిని తన చెప్పుచేతల్లో ఉన్న ఇంజనీరింగ్‌, ఫైనాన్స్‌ విభాగంలోని కీలక అధికారుల ద్వారా బెదిరించి తన దారికి తెచ్చుకున్నారు.

కమీషన్‌ కోసం ఒత్తిడి

ఇదిలావుండగా ఇప్పటివరకు లాటరీద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు రెండుశాతం చొప్పున యూనియన్‌కు కట్టాల్సిందేనంటూ గ్రూపులో సదరునేత మెసేజ్‌ పెట్టడంతో కాంట్రాక్టర్లు అవాక్కవుతున్నారు. వర్కులను లాటరీద్వారా పంచుకోవడానికి సహకరించిన ఇంజనీరింగ్‌ అధికారులకు తాను ఇప్పటికే రూ.లక్షల్లో ఖర్చుపెట్టానని, ఆ మొత్తాన్ని యూనియన్‌ ఖాతానుంచి నుంచి వాడేసినందున, కాంట్రాక్టర్లంతా తాము తీసుకున్న పనుల మొత్తంలో రెండుశాతం చొప్పున యూనియన్‌కు చెల్లించాలని హుకుం జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. తన పరపతి పెంచుకోవడం కోసం అధికారులకు డబ్బులు ఇస్తే, వాటిని కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా రెండుశాతం ఇవ్వకపోతే వారికి తర్వాత పనులు రాకుండా, బిల్లులు నమోదు చేయకుండా ఇంజనీరింగ్‌ అధికారులు, ఎంబుక్‌ రికార్డింగ్‌, జనరల్‌ ఓచర్‌ వచ్చిన బిల్లులకు చెక్‌లు రాయకుండా అకౌంట్స్‌ విభాగం అధికారులతో ఇబ్బందులకు గురిచేస్తానని బెదిరిస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ దృష్టిసారించి లాటరీ విధానంలో పనుల కేటాయింపునకు చెక్‌ చెప్పాలని కోరుతున్నారు.

Updated Date - May 25 , 2026 | 12:13 AM