కూటమికి 98
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:28 AM
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది.
తెలుగుదేశం పార్టీకి 64, జనసేనకు 26, బీజేపీకి 8 వార్డులు
13 వార్డులకు వైసీపీ పరిమితం
ఎనిమిది వార్డుల్లో ఇండిపెండెంట్లు, ఒకచోట సీపీఎం గెలుపు
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఎంతోకొంత పోటీ ఇస్తుందని భావించిన వైసీపీ దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. మొత్తం 120 వార్డులకుగాను 98 వార్డులను కూటమి కైవసం చేసుకోగా, వైసీపీ కేవలం 13 వార్డులకు పరిమితమైంది. ఎనిమిది వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఒకచోట సీపీఎం అభ్యర్థి గెలుపొందారు.
జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ 77, జనసేన 32, బీజేపీ 11 వార్డుల్లో తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి. వైసీపీ నుంచి 120 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే 14వ వార్డులో రెడ్డి కిరణ్మయి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో వైసీపీ నుంచి 119 మంది పోటీకి నిలిచినట్టయ్యింది. సీపీఎం 14 వార్డులు, సీపీఐ ఆరు వార్డుల్లో పోటీ చేశాయి. ఈ నెల ఒకటో తేదీన పోలింగ్ జరగ్గా, మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. టీడీపీ అభ్యర్థులు 64, జనసేన అభ్యర్థులు 24, బీజేపీ అభ్యర్థులు ఎనిమిది వార్డుల్లో విజయం సాధించారు. వైసీపీ నుంచి 119 మంది పోటీ చేయగా, కేవలం 13 మంది మాత్రమే గెలుపొందారు. సీపీఎం నుంచి 14 మంది పోటీ చేయగా 105వ వార్డు నుంచి పోటీచేసిన ఎం.కృష్ణయ్య మాత్రమే విజయం సాధించారు.
అత్యధిక మెజారిటీ 8312, అత్యల్పం 5 ఓట్లు
14వ వార్డులో టీడీపీ అభ్యర్థి కాకి గంగరాజు అత్యధికంగా 8,312 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆ తర్వాత 116వ వార్డు నుంచి పోటీ చేసిన టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీకాంత్ 6517 ఓట్ల మెజారిటీ సాధించారు. శ్రీకాంత్‌కు 9,649 ఓట్లు రాగా, అతడి ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీచేసిన మాకిరెడ్డి అప్పలనాయుడుకు 3,132 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక 91వ వార్డులో టీడీపీ కార్పొరేటర్ బొడ్డు నర్సింహపాత్రుడు కేవలం ఐదు ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. పాత్రుడికి 1,980 ఓట్లు రాగా అతని ప్రత్యర్థి మద్దాల అప్పారావుకు 1,975 ఓట్లు వచ్చాయి. అలాగే 65వ వార్డులో వైసీపీ అభ్యర్థిని జహీరున్నీసా ఏడు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిని కేవీ సుగుణమణిపై విజయం సాధించారు.
సత్తాచాటిన టీడీపీ
77 వార్డుల్లో పోటీ...64 వార్డుల్లో గెలుపు
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని నమోదుచేసింది. మొత్తం 120 వార్డులకు గాను 77 వార్డుల్లో పోటీ చేసి 64 స్థానాల్లో (83.11 శాతం) గెలుపొందింది. జీవీఎంసీ గత కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న పలువురు తిరిగి కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ఇక పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన ముక్కా శ్రావణి దాదాపు రెండున్నర లక్షల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వరుదు కళ్యాణిపై విజయం సాధించారు. ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఇతర నాయకులు సమన్వయకంతో పనిచేయడంతోనే కూటమి అభ్యర్థులు భారీగా విజయం సాధించారు.
8 వార్డుల్లో కమలం
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
కూటమిలో భాగమైన బీజేపీకి 11 వార్డుల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. అందులో ఎనిమిది వార్డుల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, మూడు వార్డుల్లో ఓడిపోయారు. 54వ వార్డులో జిల్లా పార్టీ అధ్యక్షుడు పరశురామరాజు, 53లో ఉమ్మడి సుజాత, 57వ వార్డులో కొరిబిల్లి నందిని, 58వ వార్డులో గంకల అప్పారావు, 81వ వార్డులో పొలిమేర శ్రీనివాసరావు, 85వ వార్డులో గొరపల్లి సునీత, 88వ వార్డులో సిరసపల్లి నూకరాజు, 111వ వార్డులో పలకా యశోద గెలుపొందారు. 39వ వార్డులో జె.దామోదరరావు, 88వ వార్డులో సిరసపల్లి నూకరాజు, 98వ వార్డులో డెంకంకొండ కృష్ణంరాజులు ఓటమి చెందారు.
జనసేన విజయభేరి
32 వార్డుల్లో పోటీ... 26 కైవసం
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన మంచి ఫలితాలు సాధించింది. ఆ పార్టీ అభ్యర్థులు మొత్తం 32 వార్డుల్లో పోటీ చేయగా 26 చోట్ల విజయం సాధించారు. వీరు కాకుండా పార్టీ టికెట్లు ఇవ్వలేదని రెబల్స్‌గా పోటీ చేసిన మరో ఇద్దరు 73, 106 వార్డుల్లో గెలిచారు. 5, 11, 12, 26, 31, 32, 33, 34, 37, 40, 43, 46, 62, 75, 79, 80, 93, 95, 102, 103, 109, 110, 112, 113, 114, 115 వార్డుల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.
చతికిలపడిన వైసీపీ
ఘోర పరాజయంతో పారీ ్టనేతల్లో నిస్పృహ
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో వైఎ్‌సఆర్ కాంగ్రె్స పార్టీ చతికిలపడింది. 119 వార్డుల్లో పోటీ చేసి కేవలం పదమూడుచోట్ల మాత్రమే విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు తీవ్ర నిరాశా,నిస్పృహల్లో కూరుకుపోయారు. వైసీపీ తరపున ఆరో వార్డు నుంచి పోతిన హనుమంతరావు, ఏడో వార్డు నుంచి పోతిన జాహ్నవి, 19వ వార్డు నుంచి మొల్లి లక్ష్మి, 42వ వార్డు నుంచి కోడిగుడ్ల పూర్ణిమ, 59వ వార్డు నుంచి అల్లువెంకటసత్యశ్రీ, 65వ వార్డు నుంచి షేక్ జహరున్నీషా, 76వ వార్డు నుంచి సోమదల సురేష్, 84వ వార్డు నుంచి గుడివాడ వెంకటసాయిఅనూష, 92వ వార్డు నుంచి గొందేశి శ్రీదేవి, 94వ వార్డు నుంచి ధర్మాల రాధిక, 99వ వార్డు నుంచి కోమటి శ్రీనివాసరావు, 104వ వార్డు నుంచి మద్ది శ్రీనివాసరావు, 119వ వార్డు నుంచి దాసరి అన్నపూర్ణ ఎన్నికయ్యారు.
రెబల్స్ హవా
ఎనిమిది వార్డుల్లో గెలుపు
అత్యధికులు కూటమి పార్టీలకు చెందినవారే...
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో ఈసారి రెబల్ (స్వతంత్ర) అభ్యర్థులు ఎనిమిది వార్డుల్లో గెలిచారు. వీరిలో అత్యధికులు కూటమి పార్టీల మధ్య సర్దుబాట్లతో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం రాక స్వతంత్రులుగా బరిలో దిగారు. సొంత పార్టీ అభ్యర్థులపైనే మంచి మెజారిటీతో గెలిచారు. వీరు 36, 39, 41, 73, 86, 98, 106, 118 వార్డుల్లో విజయం సాధించారు.
- 36వ వార్డులో కొల్లి సింహాచలం స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. గతంలో ఆమె వైసీపీలో ఉండేవారు. కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆ తరువాత జనసేనలో చేరారు. కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి టికెట్ కోరారు. అవకాశం రాకపోకవడంతో స్వతంత్రంగానే పోటీ చేసి గెలిచారు.
- 39వ వార్డులో కూటమి తరపున బీజేపీ అభ్యర్థి దామోదర యాదవ్ పోటీ చేయగా టీడీపీ నుంచి టికెట్ ఆశించిన బత్తిన నవీన్‌కుమార్ రెబల్‌గా బరిలో దిగారు. ఇటు కూటమి, అటు వైసీపీ అభ్యర్థులను ఓడించి విజయం సాధించారు.
- 86వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా కాకి గోవిందరెడ్డి పోటీ చేసి గెలిచారు. ఆయన టీడీపీకి చెందిన నాయకుడు. మాజీ కార్పొరేటర్. గతంలో టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి సన్నిహితంగా మెలిగారు. ఆ తరువాత మళ్లీ టీడీపీకి దగ్గరయ్యారు. ఈసారి పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్‌గా పోటీ చేసి విజయం సాధించారు.
- 106లో జనసేన పార్టీకి చెందిన దుల్ల రామునాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన పార్టీ టికెట్ ఆశించారు. కూటమి పంపకాల్లో టీడీపీ తరఫున రౌతు శ్రీనివాసరావు పోటీ చేయగా, ఆయన్ను, వైసీపీ అభ్యర్థిని కూడా ఓడించి విజయం దక్కించుకున్నారు. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేక రౌతు శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం పార్టీకి రాజీనామా చేశారు.
- 41వ వార్డులో పంపాన రాజ్యలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఈమె టీడీపీ నాయకురాలు. టికెట్ దక్కలేదు. దాంతో దక్షిణ నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జి ఇంటికి వెళ్లి చాలెంజ్ చేసి మరీ గెలిచారు.