Share News

92.02 శాతం పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:37 PM

జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా తొలిరోజు సోమవారం 92.02 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్‌ నగదు అందజేశారు.

92.02 శాతం పింఛన్ల పంపిణీ
పాడేరులో వృద్ధురాలికి పింఛన్‌ సొమ్ము అందజేస్తున్న కలెక్టర్‌ నిషాంతి

మొత్తం 73,549 మంది లబ్ధిదారులకు గాను 67,679 మందికి అందజేత

పాడేరు, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా తొలిరోజు సోమవారం 92.02 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్‌ నగదు అందజేశారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో మొత్తం 73 వేల 549 మంది పెన్షన్‌ లబ్ధిదారులకు రూ.31 కోట్ల 13 లక్షల 98 వేలు విడుదల కాగా, తొలి రోజు సోమవారం రాత్రి 8 గంటల సమయానికి 67,679 మందికి రూ.28 కోట్ల 60 లక్షల 28 వేలను అందించారు. ఇంకా 5,870 మందికి పెన్షన్‌ సొమ్ము అందించాల్సి ఉంది. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 92.02 శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. తొలి రోజు పెన్షన్‌ పొందని లబ్ధిదారులకు మంగళవారం అందజేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు పేర్కొన్నారు. పాడేరు పట్టణంలో కలెక్టర్‌ టి.నిషాంతి పలువురు వృద్ధులకు పెన్షన్‌ సొమ్మును అందించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లాలో పలు చోట్ల జరిగిన పెన్షన్‌ పంపిణీ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, పాడేరు పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, తెలుగు మహిళా నేతలు డిప్పల వెంకటకుమారి, లకే పార్వతమ్మ, అల్లంగి సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. పాడేరు మండలం తుంపాడ గ్రామంలో టూరిజం డైరెక్టర్‌ కిల్లు రమేశ్‌నాయుడు, గుత్తులపుట్టు గ్రామంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోడా వెంకట సురేశ్‌కుమార్‌, తదతరులు లబ్ధిదారులకు పెన్షన్‌ సొమ్మును అందించారు.

Updated Date - Jun 01 , 2026 | 11:37 PM