తొలి రోజు 91.87 శాతం పెన్షన్ల పంపిణీ
ABN , Publish Date - May 01 , 2026 | 11:14 PM
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజు శుక్రవారం 91.87 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించారు.
ఉగ్గంగొయ్యిలో పింఛన్లను అందజేసిన కలెక్టర్
మొత్తం 73,700 మందికి గానూ 67,710 మందికి అందజేత
పాడేరు, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజు శుక్రవారం 91.87 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 73,700 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.31 కోట్ల 17 లక్షల 36 వేలు విడుదల కాగా.. తొలి రోజు శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి 67,710 మందికి రూ.28 కోట్ల 57 లక్షల 1 వెయ్యి సొమ్మును అందించారు. ఇంకా 5,990 మందికి పెన్షన్ సొమ్ము అందించాల్సి ఉంది. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 91.87 శాతంగా నమోదైంది. తొలి రోజు పెన్షన్ పొందని లబ్ధిదారులకు శనివారం అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. పాడేరు మండలం లగిశపల్లి పంచాయతీ ఉగ్గంగొయ్యి గ్రామంలో జిల్లా కలెక్టర్ టి.నిషాంతి పలువురు వృద్ధులకు పెన్షన్ సొమ్మును అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళీ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, పాడేరు పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, లగిశపల్లి సర్పంచ్ లకే పార్వతమ్మ, తెలుగు మహిళా నేతలు డిప్పల వెంకటకుమారి, అల్లంగి సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.