తొలి రోజు 90.16 శాతం పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:03 AM
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజు బుధవారం 90.16 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించారు.
మొత్తం 73,367 మందికి గాను 66,302 మందికి అందజేత
పాడేరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజు బుధవారం 90.16 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో మొత్తం 73 వేల 367 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.31 కోట్ల 5 లక్షల 36 వేలు 5 వందలు విడుదల కాగా, తొలి రోజు బుధవారం రాత్రి 8 గంటల సమయానికి 66,302 మందికి రూ.27 కోట్ల 99 లక్షల 6 వేల 2 వందల సొమ్మును అందించగా, ఇంకా మిగిలిన 7,065 మందికి పెన్షన్ సొమ్ము అందించాల్సి ఉంది. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 90.16 శాతంగా నమోదైంది. తొలి రోజు పెన్షన్ పొందని లబ్ధిదారులకు గురువారం అందజేస్తామని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. పాడేరు మండలం కుమ్మరిపుట్టు గ్రామంలో కలెక్టర్ టి.నిషాంతి పలువురు వృద్ధులకు పెన్షన్ సొమ్మును అందించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పాడేరు పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.