తొలి రోజు 89.68 శాతం పెన్షన్ల పంపిణీ
ABN , Publish Date - Oct 30 , 2026 | 11:20 PM
జిల్లాలో తొలి రోజు శుక్రవారం 89.68 శాతం లబ్ధిదారులకు ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను అందించారు.
65,202 మందికి అందజేత
నేడు 7,391 మందికి అందజేయనున్న అధికారులు
పాడేరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి రోజు శుక్రవారం 89.68 శాతం లబ్ధిదారులకు ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను అందించారు. జిల్లాలోని 11 మండలాల్లో 72,593 మంది పెన్షన్ల లబ్ధిదారులకు రూ.30 కోట్ల 68 లక్షల 92 వేలును ప్రభుత్వం విడుదల చేసింది. తొలి రోజు శుక్రవారం రాత్రి 8 గంటలకు 65,202 మంది లబ్ధిదారులకు రూ.27 కోట్ల 52 లక్షల 18 వేల 500 సొమ్మును పంపిణీ చేశారు. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 89.68 శాతంగా నమోదైంది. వివిధ కారణాలతో తొలి రోజు పెన్షన్ పొందని 7,391 మంది లబ్ధిదారులకు శనివారం పెన్షన్ అందిస్తామని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలువురు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ టి.నిషాంతి శుక్రవారం పెన్షన్ సొమ్మును పంపిణీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సామాజిక పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మాత్రమే పెన్షన్లను పంపిణీ చేశారు.