టెన్త్‌లో 89.51% పాస్
ABN , Publish Date - May 01 , 2026 | 02:14 AM
పదో తరగతి పరీక్షల్లో జిల్లా 89.51 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో ఏడో స్థానంలో జిల్లా
ఙపరీక్షలకు 28,929 మంది హాజరు
25,894 మంది ఉత్తీర్ణత
బాలురు 13,418 మంది, బాలికలు 12,476 మంది
22,977 మందికి ప్రథమ శ్రేణి, 2,141 మందికి ద్వితీయ శ్రేణి,
776 మందికి తృతీయశ్రేణి...
విశాఖపట్నం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి పరీక్షల్లో జిల్లా 89.51 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. మొత్తం 28,929 మంది పరీక్షలకు హాజరుకాగా 25,894 మంది (89.51 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 15,258 మందికిగాను 13,418 మంది (87.94 శాతం), బాలికలు 13,671 మందికిగాను 12,476 మంది (91.26 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే బాలికలు 3.32 శాతం ఎక్కువగా పాసయ్యారు. గత ఏడాది 89.14 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిన జిల్లా, 2025-26 విద్యా సంవత్సరంలో 0.37 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించినా ఏడో స్థానానికి దిగజారింది. మొత్తం 26 జిల్లాల్లో ఉత్తరాంధ్ర నుంచి పార్వతీపురం మన్యం ప్రథమ స్థానంలో ఉండగా, విజయనగరం మూడు, శ్రీకాకుళం ఐదు, అనకాపల్లి ఆరో స్థానంలో, విశాఖ ఏడో స్థానంలో నిలిచింది. కాగా మొత్తం విద్యార్థుల్లో 22,977 మంది ప్రథమ శ్రేణి, 2,141 మంది ద్వితీయ శ్రేణి, 776 మంది తృతీయ శ్రేణి సాధించారు.
పది మందికి 597 కంటే ఎక్కువ మార్కులు
జిల్లాలో ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పది మందికి 597, అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎన్‌ఏడీ కొత్తరోడ్డులోని శ్రీచైతన్య పాఠశాలకు చెందిన కొత్తపల్తి జ్ఞానేశ్వరి 599 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే కొమ్మాది శ్రీచైతన్య స్కూల్‌కు చెందిన ఈడుబిల్లి తుషిత 598, మరో ఎనిమిది మంది 597 మార్కులు తెచ్చుకున్నారు.
జడ్పీ విద్యార్థులకు 590 మార్కులు
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు 590, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు. నడుపూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఇమంది దేవిక, నరవ జడ్పీ విద్యార్థి సానపాటి పునీత్‌కుమార్ 592 మార్కులతో టాపర్లుగా ఉన్నారు. గోపాలపట్నం బాలికల పాఠశాల విద్యార్థి అంబల స్రవంతి, అక్కిరెడ్డిపాలెం స్కూలు విద్యార్థి వంగపండు శివసాయి అదితి 591 మార్కులు, గాజువాక స్కూలు విద్యార్థి చింతాడ దుర్గాశ్రీవల్లి, వేపగుంట స్కూలు విద్యార్థి కర్నేని రామతులసి, అగంపూడి జడ్పీ స్కూలు విద్యార్థులు మేడిశెట్టి హర్షిత నాగ భువన, చట్టి మణిశ్రీ 590 మార్కులు సాధించారు.
వెనుకబడిన జీవీఎంసీ స్కూల్స్
93.75 శాతం ఉత్తీర్ణతతో కేఎన్‌ఎం బాలికల ఉన్నత పాఠశాల ఫస్ట్
44.44 శాతం ఉత్తీర్ణతతో రాయపాలెం స్కూల్ లాస్ట్
విశాఖపట్నం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి):
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జీవీఎంసీ పాఠశాలలు బాగా వెనుకబడ్డాయి. మొత్తం 21 ఉన్నత పాఠశాలు ఉండగా రైల్వేన్యూకాలనీలోని కేఎన్‌ఎం బాలికల ఉన్నత పాఠశాల 93.75 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. భీమిలిలోని రాయపాలెం ఉన్నత పాఠశాల 44.44 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. 21 ఉన్నత పాఠశాలల్లో రెండు పాఠశాలలు 60 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించగా, మరో ఆరు పాఠశాలలు 61-70 శాతం మధ్య, ఏడు పాఠశాలలు 71-80 శాతం మధ్య, ఇంకొక ఆరు పాఠశాలలు 81 శాతం, అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాయి. కేఎన్‌ఎం ఉన్నత పాఠశాల ప్రథమ స్థానంలో ఉండగా, ప్రకాశరావుపేట ఉన్నత పాఠశాల 89.25 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మధురానగర్ పాఠశాల 85.23 శాతం, శ్రీహరిపురం పాఠశాల 80.95 శాతం, గాంధీగ్రామం పాఠశాల 80.77, కె.కాలనీ పాఠశాల 79.57, మల్కాపురం పాఠశాల 78.5, ఎంవీడీ 76.19, కప్పరాడ పాఠశాల 76.8, ఎన్జీజీవో పాఠశాల 72.84, భీమిలిలోని పీఎన్‌ఎం స్కూలు 71.64, ఎంజీఎం ఉన్నత పాఠశాల 70.16, సీతమ్మధారలోని నెహ్రూ మునిసిపల్ ఉన్నత పాఠశాల 69.23, డాక్టర్ అంబేడ్కర్ ఉన్నత పాఠశాల 69.05, న్యూకాలనీలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాల 65.52, భీమిలి 15వ వార్డు ఉన్నత పాఠశాల 62.86, ఆర్పీ పేట ఉన్నత పాఠశాల 60.27, కేడీపీఎం ఉన్నత పాఠశాల 60.13, ఎంవీడీఎం ఉన్నత పాఠశాల 58.49 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా సగటు 89.51 శాతం కంటే జీవీఎంసీ పరిధిలోని కేఎన్‌ఎం ఉన్నత పాఠశాల (93.75) ఎక్కువ ఉత్తీర్ణత సాధించగా మిగిలిన 20 పాఠశాలలు తక్కువ సాధించాయి.