79 పంచాయతీల్లో 802 పోలింగ్ కేంద్రాలు
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:39 AM
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డులవారీగా పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఆదివారం విడుదల చేశారు.
ముసాయిదా జాబితా విడుదల
26 వరకు అభ్యంతరాల స్వీకరణ
మొత్తం ఓటర్లు 1,62,407
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డులవారీగా పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఆదివారం విడుదల చేశారు. జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల్లో 802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వ భవనాలు (పాఠశాల, పంచాయతీ భవనాలను) గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వివరాలు జాబితాలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ ఎన్నికలకు 802 వార్డుల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈసారి కొద్దిచోట్ల భవనాల పటిష్టతను పరిగణనలోకి తీసుకుని కొత్త భవనాలను గుర్తించారు. జాబితాను ఆయా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. వీటిపై అభ్యంతరాలను 26లోగా తెలియజేయాల్సి ఉంటుంది. వాటిని కలెక్టర్ పరిశీలనకు పంపించి, ఈనెల 31న తుది జాబితా విడుదలచేయనున్నారు. జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలోని 79 గ్రామ పంచాయతీల్లో 1,62,407 ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలపై పంచాయతీల వారీగా ఈనెల 18 నుంచి చేపట్టిన సర్వే సోమవారంతో ముగియనున్నది. ఈ జాబితా 25న విడుదలచేస్తారు. దీనిపై వచ్చేనెల ఐదోతేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, ఏడో తేదీన తుది జాబితా ప్రకటిస్తారు.