749 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:13 PM
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని కాఫీ తోటల్లో దాచిపెట్టిన 749 కిలోల ఎండు గంజాయిని పోలీసులు, ఈగల్ బృందం సంయుక్తంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ముంచంగిపుట్టు మండలం సంగంవలస గ్రామ సమీపంలోని కాఫీ తోటల్లో నిల్వ చేసినట్టు గుర్తించిన పోలీసులు, ఈగల్ బృందం
నిందితుల కోసం గాలింపు
ఎస్‌పీ అమిత్‌బర్దార్ వెల్లడి
పాడేరు, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని కాఫీ తోటల్లో దాచిపెట్టిన 749 కిలోల ఎండు గంజాయిని పోలీసులు, ఈగల్ బృందం సంయుక్తంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్‌పీ అమిత్‌బర్దార్ ఆదివారం మీడియాకు తెలియజేశారు. జిల్లాలో గంజాయిని శాశ్వతంగా నిర్మూలించేందుకు ఆపరేషన్ వజ్ర పహార్ పేరిట అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు పంచాయతీ సంగంవలస గ్రామానికి ఆనుకుని ఉన్న కాఫీ తోటల్లో గంజాయిని నిల్వ చేశారని అందిన విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులు, ఈగల్ బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. అక్కడ 39 మూటల్లో దాచిపెట్టిన 749 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకుని ముంచంగిపుట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గంజాయి విలువ రూ.37 లక్షల 45 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నామని ఎస్‌పీ తెలిపారు. ఈ గంజాయిని ఎవరు నిల్వ చేశారనే దానిపై ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నామని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. 749 కిలోల గంజాయిని పట్టుకున్న జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు, ముంచంగిపుట్టు ఎస్‌ఐ నాని, ఈగల్ బృందం, స్థానిక పోలీసులను ఎస్‌పీ అమిత్‌బర్దార్ అభినందించారు. జిల్లాను గంజాయి రహితం చేయాలనే లక్ష్యంతో ‘ఆపరేషన్ వజ్ర పహార్’ కొనసాగిస్తున్నామని, ప్రజలు గంజాయికి దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఏ వ్యవహారంతో సంబంధమున్నా, వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి.మాడుగుల సీఐ బి.శ్రీనివాసరావు, ముంచంగిపుట్టు ఎస్‌ఐ పి.నాని, సిబ్బంది పాల్గొన్నారు.