Share News

ఉత్సవాల బందోబస్తుకు 700 మంది పోలీసులు

ABN , Publish Date - May 16 , 2026 | 10:48 PM

ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులు జరగనున్న పాడేరు మోదకొండమ్మ రాష్ట్ర జాతరకు 700 మంది సిబ్బందిని బందోబస్తుకు నియమించామని జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు.

ఉత్సవాల బందోబస్తుకు 700 మంది పోలీసులు
మోదకొండమ్మ ఉత్సవ బందో బస్తు నిర్వహణపై పోలీసు సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్పీ అమిత్‌ బర్దార్‌

ఎస్పీ అమిత్‌ బర్దార్‌

పాడేరురూరల్‌, మే 16(ఆంధ్రజ్యోతి): ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులు జరగనున్న పాడేరు మోదకొండమ్మ రాష్ట్ర జాతరకు 700 మంది సిబ్బందిని బందోబస్తుకు నియమించామని జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాలు సజావుగా జరగడానికి రెండు శక్తి టీమ్‌లు, మూడు డ్రోన్‌ పార్టీలు, క్రైమ్‌ పార్టీ సిబ్బంది పట్టణ పరిసర ప్రాంతాల్లో మొహరిస్తాయన్నారు. ఉత్సవాల దృష్ట్యా భారీ వాహనాలు, సరుకు రవాణా వాహనాలు పాడేరు పట్టణంలోకి ప్రవేశించడాన్ని శనివారం నుంచి నిషేధించమన్నారు. ఉత్సవాల మూడు రోజులు ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి పట్టణంలోకి వాహనాలను అనుమతించమన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టామన్నారు. విశాఖ నుంచి అరకు వెళ్లే వాహనాలు వంతాడపల్లి, తుంపాడ, సన్యాసమ్మపాలెం, అడారిమెట్ట మీదుగా వెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు. విశాఖ నుంచి జి.మాడుగులకు వెళ్లే వాహనాలు నక్కలపుట్టు, వర్తనాపల్లి, లగిశపల్లి, సెయింటాన్‌ స్కూల్‌ మీదుగా నడిచేలా చర్యలు చేపట్టామన్నారు. మహిళలు, పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించినా, ఈవ్‌-టీజింగ్‌, వేధింపులు, మద్యం తాగి అల్లరి చేయడం, ఇన్‌డీసెంట్‌ ప్రవర్తన వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 10:48 PM