Share News

69 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:25 PM

ఒడిశా నుంచి తమిళనాడుకు ఆటోలో తరలిస్తున్న 69 కిలోల గంజాయిని కొయ్యూరు పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు.

69 కిలోల గంజాయి పట్టివేత
గంజాయి నిందితులతో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కిశోర్‌వర్మ సిబ్బంది

ఇద్దరి అరెస్టు.. మరికొందరు పరారీ

పట్టుబడిన గంజాయి విలువ రూ.35 లక్షలు

ఆటో, రెండు సెల్‌ఫోన్లు సీజ్‌

కొయ్యూరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి తమిళనాడుకు ఆటోలో తరలిస్తున్న 69 కిలోల గంజాయిని కొయ్యూరు పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా.. మరికొందరు పరారయ్యారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.35 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించి సీఐ శ్రీనివాసరావు అందజేసిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని బూదరాళ్ల మీదుగా మైదాన ప్రాంతానికి గంజాయి రవాణా జరుగుతున్నట్టు కొయ్యూరు ఎస్‌ఐ పి.కిశోర్‌వర్మకు ముందస్తు సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి సిబ్బందితో కలిసి ఎస్‌ఐ చీడిపాలెం కూడలిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బూదరాళ్ల నుంచి వస్తున్న ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా.. అందులో ఉన్న వ్యక్తులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆటోను అదుపులోకి తీసుకుని పారిపోతున్న వారిని వెంబడించి ఇద్దరుని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన తాళే కోటిబాబు, పడియామి బచేల్‌ను విచారించగా.. ఆటోలో రహస్య అరలు ఏర్పాటు చేసి గంజాయిని ఒడిశా నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తీసుకువెళుతున్నామని, అక్కడి నుంచి తమిళనాడు తరలిస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఆటో పరిశీలించగా.. అందులో 69 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. పరారయ్యారైన వారి కోసం గాలిస్తున్నామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.35 లక్షలు ఉంటుందని, పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తున్నట్టు చెప్పారు. విలేకర్ల సమావేశంలో సీఐతోపాటు ఎస్‌ఐ కిషోర్‌వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

.

Updated Date - Apr 12 , 2026 | 11:25 PM