గ్రేటర్‌కు రూ.620 కోట్లు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:59 AM
జీవీఎంసీ పరిధిలో ఆస్తి పన్ను రికార్డు స్థాయిలో వసూలైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను కింద రూ.620 కోట్లు ఆదాయం వచ్చింది.
రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు
గత ఏడాదికంటే రూ.110 కోట్లు అధికం
ప్రైవేటు అసెస్‌మెంట్‌ల నుంచి రూ.456.15 కోట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.163.85 కోట్లు
విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో ఆస్తి పన్ను రికార్డు స్థాయిలో వసూలైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను కింద రూ.620 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రూ.110 కోట్లు అధికం.
జీవీఎంసీ పరిధిలో 6,02,937 ప్రైవేటు అసెస్‌మెంట్‌ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను/బకాయిలు కింద రూ.569.59 కోట్లు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు నుంచి బకాయిల రూ.200 కోట్లు వసూలుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) ఎస్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తూ వచ్చారు. బకాయిదారులకు జప్తు నోటీసులు ఇవ్వడంతోపాటు స్పందించని వారి ఆస్తులను సీజ్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన వైజాగ్ పోర్టు ట్రస్ట్, హెచ్‌పీసీఎల్ వంటి వాటితో కమిషనర్ కేతన్‌గార్గ్ స్వయంగా సంప్రతింపులు జరిపి, ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేలా చొరవ తీసుకున్నారు. వీటన్నింటి కారణంగా ఆస్తిపన్నుతోపాటు బకాయిలు వసూళ్లలో పురోగతి కనిపించింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలపై 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పించడం కలిసివచ్చింది. ప్రైవేటు అసెస్‌మెంట్‌ల బకాయిలు రూ.134.54 కోట్లు ఉండగా రూ.74.14 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను కింద రూ.435.05 కోట్లకుగాను రూ.382 కోట్లు మొత్తం రూ.456.15 కోట్లు వసూలుచేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నుతోపాటు బకాయిల కింద రూ.163.85 కోట్లు వసూలు చేశారు. మంగళవారం వైజాగ్ పోర్టు ట్రస్ట్ నుంచి రూ.12 కోట్లు, హెచ్‌పీసీఎల్ నుంచి రూ.7.62 కోట్లు జమ అయ్యాయి. రికార్డు స్థాయిలో పన్ను వసూలుకావడంపై డీసీఆర్ శ్రీనివాసరావు స్పందిస్తూ కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశాల మేరకు కార్యాచరణ రూపొందించి అమలుచేశామన్నారు. గత ఏడాది కంటే సుమారు రూ.110 కోట్లు అధికంగా పన్ను వసూలు కావడం ఆనందంగా ఉందన్నారు.