Share News

గూగుల్‌కు 601.4 ఎకరాలు

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:11 AM

రాష్ట్ర మంత్రివర్గం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకుంది.

గూగుల్‌కు 601.4 ఎకరాలు

ఆ సంస్థ నోటిఫైడ్‌ భాగస్వామిగా పేర్కొన్న అదానీ ఇన్‌ఫ్రాకు కేటాయింపు

డేటా సెంటర్‌ కోసం 3 ఎస్‌పీవీలు

అడవివరం, ముడసర్లోవల్లో దేవదాయ శాఖ భూములు

ఏపీఐఐసీ ద్వారా 30 ఏళ్లకు లీజుకు...

తర్లువాడలో రూ.2,387.81 కోట్లతో సెమీ కండక్టర్‌ పరిశ్రమ

రుషికొండలో పర్యాటక ప్రాజెక్టులకు రాయితీలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర మంత్రివర్గం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. గూగుల్‌ ఏర్పాటు చేయబోయే వేయి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌కు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మొత్తం 601.4 ఎకరాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. గూగుల్‌ నోటిఫైడ్‌ భాగస్వామిగా పేర్కొన్న అదానీ ఇన్‌ఫ్రాకు ప్రాజెక్టు గ్రౌండింగ్‌ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పనుల కోసం అదానీ సంస్థ మూడు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తోంది. వైజాగ్‌ హైపర్‌ స్కేల్‌, వైజాగ్‌ మెగా, వైజాగ్‌ రాంబిల్లి డేటా సెంటర్‌ పేరుతో ఇవి పనిచేస్తాయి. అడవివరం, ముడసర్లోవల్లో దేవదాయ శాఖ భూములను ఏపీఐఐసీ ద్వారా 30 ఏళ్లకు లీజుకు ఇవ్వనున్నారు.

ఇదిలావుండగా ఆనందపురం మండలం తర్లువాడలో అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ టెక్నాలజీస్‌కు 30 ఎకరాలు కేటాయించారు. ఇందులో రూ.2,387.81 కోట్లతో సెమీ కండక్టర్‌ అసెంబ్లింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటవుతుంది. దీనిద్వారా నేరుగా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

- రుషికొండలో వీరాంజనేయ సంస్థ ‘వి’ హోటల్‌ పేరుతో నిర్మించే 3 స్టార్‌ హోటల్‌కు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయం మేరకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు.

- రుషికొండలో వెస్టిన్‌ బ్రాండ్‌ కింద బీచ్‌ రిసార్ట్స్‌ ఏర్పాటుచేసే వారికి కూడా రాయితీలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు.

- రుషికొండలో క్రౌన్‌ ప్లాజా బ్రాండ్‌తో ‘కోస్టల్‌ హాస్పిటాలిటీ’ కోసం భూమి కేటాయింపు పాటు రాయితీలకు ఆమోదించారు.


పర్యాటక హబ్‌గా విశాఖ

రూ.8,650 కోట్లతో 50 ఒప్పందాలు

రుషికొండలో అడ్వంచర్‌ స్పోర్ట్స్‌

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.8,650 కోట్లతో 50 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్‌ వెల్లడించారు. శాసనసభలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ పర్యాటకాభివృద్ధి గురించి ప్రశ్నించినప్పుడు ఆయన పలు వివరాలు వెల్లడించారు. హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో విశాఖను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రుషికొండలో అడ్వంచర్‌ స్పోర్ట్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రుషికొండ, తిమ్మాపురం, సాగర్‌నగర్‌ బీచ్‌, గోస్తనీ బ్యాక్‌ వాటర్స్‌లో స్కూబా డైవింగ్‌, పారా మోటారింగ్‌ వంటి పది జల క్రీడలు ప్రారంభించనున్నామని చెప్పారు.

Updated Date - Feb 25 , 2026 | 01:11 AM