పోలింగ్ 58.85 శాతం
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:00 AM
జిల్లాలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మూడు మండలాల్లో 65 గ్రామ పంచాయతీలు, 550 వార్డులకు ఎన్నికలను నిర్వహించారు. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లోని మొత్తం 65 పంచాయతీల్లో 1,60,317 ఓట్లకు గానూ 94,349 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్ 58.85 శాతంగా అధికారులు ధ్రువీకరించారు.
- తొలి విడత చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు
- మూడు మండలాల్లో మొత్తం 1,61,317 ఓట్లలో పోలైనవి 94,349
- మొత్తం 65 పంచాయతీల్లో సర్పంచులకు 268 మంది, 550 వార్డులకు 1,330 మంది పోటీ
- చింతపల్లిలో 56.05, జీకేవీధిలో 55.45, కొయ్యూరులో 67.35 శాతం పోలింగ్
(పాడేరు - ఆంధ్రజ్యోతి)
జిల్లాలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మూడు మండలాల్లో 65 గ్రామ పంచాయతీలు, 550 వార్డులకు ఎన్నికలను నిర్వహించారు. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లోని మొత్తం 65 పంచాయతీల్లో 1,60,317 ఓట్లకు గానూ 94,349 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్ 58.85 శాతంగా అధికారులు ధ్రువీకరించారు.
చింతపల్లి మండలంలోని 17 పంచాయతీల పరిధిలో మొత్తం 65,374 ఓట్లకు 3,6644 ఓట్లు వేయగా 56.05 శాతంగా నమోదైంది. అలాగే జీకేవీధి మండలంలోని 16 పంచాయతీల్లో మొత్తం 52,412 ఓట్లకు 29,062 పడడంతో పోలింగ్ 55.45 శాతంకాగా, కొయ్యూరు మండలంలోని 33 పంచాయతీల్లో మొత్తం 42,531 ఓట్లకు 28,643 పోలవడంతో 67.35గా నిర్ధారించారు. తొలి విడతలో కొయ్యూరు మండలంలో అత్యధికంగా 67.35 పోలింగ్ జరగ్గా, అత్యల్పంగా జీకేవీధి మండలంలో 55.45 శాతం పోలింగ్ జరిగింది.
ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
జిల్లాలో తొలి విడతలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లోని పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్‌పీ అమిత్‌బర్దార్ ఆదేశాలతో చింతపల్లి ఏఎస్‌పీ మహేంద్ర సిన్హ్, మూడు మండలాల్లోని సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది నిరంతరం పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు, తగాదాలు చోటు చేసుకోకుండా ప్రజల్ని చైతన్యం చేశారు. దీంతో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా పంచాయతీ ఎన్నికలను సిబ్బంది ప్రశాంతంగా నిర్వహించారు.
పల్లె పోరులో పెద్దగా పెరగని పోలింగ్ శాతం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం పెద్దగా పెరగలేదు. ఈ నెలలోనే పరిషత్ ఎన్నికల్లో పాల్గొనడంతో పాటు ప్రస్తుతం పంట కోతలు, నూర్పుల నేపథ్యంలో జనం పోలింగ్‌పై ఆశించినంత దృష్టి సారించలేదని తెలుస్తున్నది. వాస్తవానికి గ్రామస్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కాస్త ఎక్కువగా నమోదవడం సహజం. కానీ ఏజెన్సీలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో చింతపల్లి మండలంలో 65,374 ఓట్లకు 35,460 ఓట్లు పోలై 54.24 శాతం, అలాగే జీకేవీధి మండలంలో 52,412 ఓట్లకు 18,223 పోలై 34.77 శాతం, కొయ్యూరు మండలంలో 43,711 ఓట్లకు 26,344 పోలై 60.27 శాతం నమోదైంది. అదే పంచాయతీ ఎన్నికల్లో చింతపల్లిలో 56.05, జీకేవీధిలో 55.45, కొయ్యూరులో 67.35 శాతం పోలింగ్ జరిగింది. అయితే అటు, ఇటుగా రెండు శాతం మించి లేదు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ జరుగుతుందని అధికారులు, రాజకీయ పరిశీలకులు భావించినప్పటికీ 60 శాతం మించకపోవడం విశేషం.