Share News

వీఈఆర్‌ అభివృద్ధికి 5000 కోట్లు

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:48 AM

విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) అభివృద్ధికి రూ.5 వేల కోట్లతో ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. నీతి ఆయోగ్‌ సూచన మేరకు వీఈఆర్‌లో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు పది జిల్లాలను చేర్చారు. ఇందులోనే భాగంగానే విశాఖపట్నం కేంద్రంగా ‘బే సిటీ’ పేరుతో ఫ్లాగ్‌ షిప్‌ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీని పరిధి 40 చదరపు కిలోమీటర్లు. కైలాసగిరి నుంచి భీమిలి వరకు 25 కి.మీ. తీర ప్రాంతం ఇందులో ఉంది.

వీఈఆర్‌ అభివృద్ధికి  5000 కోట్లు

రాంబిల్లి-అనకాపల్లి-చోడవరం-పద్మనాభం-భోగాపురం సెమీ రింగ్‌రోడ్డు ప్రతిపాదన

యారాడల టూరిజం ఎకనామిక్‌ జోన్‌...స్టార్‌ హోటళ్లు, రిక్రియేషన్‌, కన్వెన్షన్‌ సెంటర్లు

ఐటీ, డేటా సెంటర్లకు కనెక్టివిటీ

ఫ్లాగ్‌ షిప్‌గా బే సిటీ

కైలాసగిరి నుంచి భీమిలి వరకూ అభివృద్ధి

సింగపూర్‌ తరహాలో తీర్చిదిద్దాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన

6న సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) అభివృద్ధికి రూ.5 వేల కోట్లతో ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. నీతి ఆయోగ్‌ సూచన మేరకు వీఈఆర్‌లో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు పది జిల్లాలను చేర్చారు. ఇందులోనే భాగంగానే విశాఖపట్నం కేంద్రంగా ‘బే సిటీ’ పేరుతో ఫ్లాగ్‌ షిప్‌ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీని పరిధి 40 చదరపు కిలోమీటర్లు. కైలాసగిరి నుంచి భీమిలి వరకు 25 కి.మీ. తీర ప్రాంతం ఇందులో ఉంది.

సింగపూర్‌ తరహాలో బే సిటీని అభివృద్ధి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. విశాఖను అంతర్జాతీయ స్థాయిలో కోస్టల్‌ మెట్రోపాలిటన్‌ సిటీగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తోంది. ‘మియామీ ఆఫ్‌ ది ఈస్ట్‌’గా గుర్తింపు తీసుకురావాలని, పర్యాటకం, తీరప్రాంతాల్లో మౌలిక వసతులు, సమీకృత నగరాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. దీనికి అవసరమైన నివేదిక తయారుచేయడానికి అహ్మదాబాద్‌కు చెందిన కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. నివేదిక వచ్చిన తరువాత ఆరు నెలల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తారు.

వీఈఆర్‌లో చేపట్టే ప్రాజెక్టులకు డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ (డీఈఏ) అఫైర్స్‌ నేతృత్వంలో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. వీఈఆర్‌లో ఒక భాగమైన సిటీ ఎకనామిక్‌ రీజియన్‌లో వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, పర్యాటక శాఖ, పరిశ్రమల శాఖ, ఐటీ శాఖలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ శాఖలు, సంస్థలు రూ.200 నుంచి రూ.300 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే వాటిని ముందుకు తీసుకువెళతామని రాష్ట్ర ప్రభుత్వానికి డీఈఏ తెలియజేసింది. ఇప్పటివరకు వీఎంఆర్‌డీఏ మూడు ప్రాజెక్టులు, జీవీఎంసీ ఏడు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రూపొందించాయి. వీటిపై ఈ నెల 6న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

- హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌రోడ్డు తరహాలో విశాఖపట్నానికి సెమీ రింగ్‌ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. సముద్రాన్ని వదిలిపెట్టి, జాతీయ రహదారికి అటు వైపు నుంచి ఈ రింగ్‌ రోడ్డు వేయాలని అధికారులు సూచించారు. రాంబిల్లి-ఎలమంచిలి-అనకాపల్లి-చోడవరం-కె.కోటపాడు-అలమండ-పద్మనాభం-రాజపులోవ-భోగాపురం విమానాశ్రయం వరకు 102 కి.మీ. పొడవున దీనిని నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు.

- యారాడలో వీఎంఆర్‌డీఏకు వేయి ఎకరాల భూమి ఉంది. దానిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై దశాబ్దకాలంగా తర్జనభర్జన పడుతున్నారు. ఇటీవల గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అక్కడ ఐటీ హబ్‌ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. అయితే అందులో టూరిజం ఎకనామిక్‌ జోన్‌ (టీఈజెడ్‌) ఏర్పాటు చేస్తామని వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించింది. దీనికి రూ.200 కోట్లు వరకు అవసరమని పేర్కొంది. అందులో స్టార్‌ హోటళ్లు, రిక్రియేషన్‌ సెంటర్లు, కన్వెన్షన్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలనేది ఆలోచన.

- విశాఖపట్నంలో ఐటీ పార్కులు, డేటా సెంటర్లు కొత్తవి ఏర్పాటవుతున్నాయి. వాటికి మౌలిక వసతులు లేవు. రుషికొండ, కాపులుప్పాడ, మధురవాడ, తర్లువాడ, భోగాపురం ప్రాంతాలను కలుపుతూ వాటికి కనెక్టివిటీ రహదారులు, ఇతర వసతులు కల్పించడానికి రూ.200 కోట్ల వరకు కోరుతున్నారు. జీవీఎంసీ, పర్యాటక శాఖ, ఐటీ, పరిశ్రమల శాఖలు ఇంకా ప్రతిపాదనలు రూపొందిస్తున్నాయి. ఆరో తేదీ నాటికి వాటిని సమావేశంలో సమర్పించనున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 01:48 AM