మన్యంలో 50 శాతం పచ్చదనం పెంపు
ABN , Publish Date - May 29 , 2026 | 10:37 PM
మన్యంలో 50 శాతం పచ్చదనం పెంచేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నదని స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి వైవీ నరసింహారావు తెలిపారు.
జిల్లాలో 15 లక్షల సీడ్ బాల్స్ తయారీ
డ్రోన్ల సాయంతో విత్తనాలు చల్లుతాం
డీఎఫ్‌వో వైవీ నరసింహారావు
చింతపల్లి, మే 29 (ఆంధ్రజ్యోతి): మన్యంలో 50 శాతం పచ్చదనం పెంచేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నదని స్థానిక డివిజనల్ ఫారెస్టు అధికారి వైవీ నరసింహారావు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఇందుకోసం జిల్లాలో 15లక్షల సీడ్ బాల్స్ తయారు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం అభివృద్ధి చేసేందుకు 2.5 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు అటవీ శాఖ ఉద్యోగులు విత్తనాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. విత్తనాల సేకరణ పూర్తికాగానే విద్యార్థులు, డ్వాక్రా సంఘాలు, ఎన్‌జీవోలతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేస్తామన్నారు. డివిజన్ పరిధిలో ఏడు లక్షల సీడ్ బాల్స్ లక్ష్యంగా చేసుకోవడం జరిగిందన్నారు. వివిధ రకాల విత్తనాలను 70 శాతం ఆవుపేడ, మరో 30శాతం మట్టితోపాటు కొద్దిగా బొగ్గు కలిపి సీడ్ బాల్స్ తయారు చేస్తామన్నారు. పాఠశాలలు పునఃప్రారంభంకాగానే ఒక్కొక్క విద్యార్థి రెండు సీడ్ బాల్స్ తయారు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సీడ్ బాల్స్‌ని వర్షాలు ప్రారంభంకాగానే పచ్చదనం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చల్లుతామన్నారు. శివారు గ్రామాల్లో మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు విత్తనాలను డ్రోన్ల సాయంతో చల్లుతామన్నారు. సహజంగా 33శాతం అడవులు ఉండాలని, అయితే రాష్ట్ర ప్రభుత్వం 50శాతం లక్ష్యంగా చేసుకోవడం జరిగిదన్నారు. ఈ విధంగా పచ్చదనం అభివృద్ధి చేయడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చునన్నారు. అటవీశాఖ చేపడుతున్న ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని డీఎఫ్‌వో నరసింహారావు పిలుపునిచ్చారు.