Share News

50 లక్షల విత్తన బంతులు సిద్ధం

ABN , Publish Date - Jun 21 , 2026 | 01:08 AM

విశాఖపట్నం అటవీ శాఖ సర్కిల్‌లోని ఆరు జిల్లాల్లో గల అడవులు, కొండలపై వెదజల్లేందుకు 50 లక్షల విత్తన బంతులు సిద్ధం చేసినట్టు ముఖ్య అటవీ శాఖాధికారి (సీసీఎఫ్‌) ఐకేవీ రాజు వెల్లడించారు.

50 లక్షల విత్తన బంతులు సిద్ధం

డ్రోన్‌ల ద్వారా అడవులు, కొండల్లో వెదజల్లుతాం

ఈ వర్షాకాలం సీజన్‌లో 1,000 హెక్టార్లలో మొక్కలు నాటుతాం

సముద్ర తీర ప్రాంతంలో రక్షణ కోసం గ్రేట్‌ గ్రీన్‌వాల్‌

కంబాలకొండకు రూ.50 లక్షలతో ఫెన్సింగ్‌

వీఎంఆర్డీఎతో కలిసి సాగర్‌నగర్‌ బీచ్‌లో ప్రత్యేక ప్రాజెక్టు

‘ఆంధ్రజ్యోతి’తో ముఖ్య అటవీ శాఖాధికారి ఐకేవీ రాజు

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం అటవీ శాఖ సర్కిల్‌లోని ఆరు జిల్లాల్లో గల అడవులు, కొండలపై వెదజల్లేందుకు 50 లక్షల విత్తన బంతులు సిద్ధం చేసినట్టు ముఖ్య అటవీ శాఖాధికారి (సీసీఎఫ్‌) ఐకేవీ రాజు వెల్లడించారు. విత్తన బంతులు వనసంరక్షణ సమితుల ద్వారా తయారుచేయించామని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. విత్తన బంతుల్లో చింత, కుంకుడు, నేరేడు, రావి, మర్రి, గానుగ, తదితర రకాల విత్తనాలు ఉంటాయన్నారు. వర్షాలు పెరిగిన తరువాత డ్రోన్‌ల ద్వారా ఈ బంతులు చల్లాలని నిర్ణయించామన్నారు.

వర్షాకాలంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 1,000 హెక్టార్లలో మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు రాజు తెలిపారు. ఇంకా రైతుల పొలాలు, కాలనీల్లో నాటేందుకు నర్సరీల్లో సరుగుడు, నీలగిరి, టేకు, ఇతర పండ్లు, పూల రకాల మొక్కలు సుమారు కోటిన్నర సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం మొక్కలు అవసరమైన రైతులు, ప్రజలు సమీపంలోని నర్సరీలకు వెళ్లాలని సూచించారు. సరుగుడు, నీలగిరి తోటలు ఎక్కువగా వేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇచ్ఛాపురం నుంచి పాయకరావుపేట వరకు తీర ప్రాంతంలో తుఫాన్ల నుంచి రక్షణ కోసం గ్రేట్‌ గ్రీన్‌వాల్‌ పేరిట వనాలు పెంచుతున్నామన్నారు. గత ఏడాది సుమారు వంద హెక్టార్లలో ఐదు లక్షల తాటి టెంకలు నాటామన్నారు. ఈ ఏడాది మరో ఐదు లక్షల టెంకలు నాటేందుకు ప్రతిపాదించామన్నారు. ఇంకా తీరంలో సరుగుడు తోటలు పెంచనున్నట్టు రాజు పేర్కొన్నారు. కేంద్ర నిధులతో అమలు చేస్తున్న గ్రేట్‌ గ్రీన్‌వాల్‌ ప్రాజెక్టు 2030 వరకు కొనసాగుతుందని, ఏటా రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వెచ్చిస్తామన్నారు. ఇంకా తీరంలో రైతులు సరుగుడు, జీడి తోటలు పెంచేలా ప్రోత్సహిస్తామన్నారు.

కంబాలకొండలో జంతువుల రక్షణ కోసం రూ.50 లక్షలతో పీఎం పాలెం స్టేడియం వరకు జాతీయ రహదారిపొడవునా కంచె ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇదిలావుండగా అడవివరం నుంచి నీలకుండీలు జంక్షన్‌ వరకు రోడ్డు విస్తరణ కోసం సుమారు మూడు హెక్టార్ల అటవీ భూమి ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ భూమికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూమి ఇస్తే మెక్కలు పెంచుతామన్నారు. కంబాలకొండలో సందర్శకులు, ట్రెక్కింగ్‌ చేసేవారికి, పర్యావరణ ప్రేమికుల కోసం పలు రకాల మౌలిక వసతులు కల్పించామని సీసీఎఫ్‌ రాజు తెలిపారు. మరింత అభివృద్ధి కోసం వీఎంఆర్డీఏతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. అలాగే సాగర్‌నగర్‌ బీచ్‌లో పర్యాటకులకు వసతులు, ట్రాక్‌, ఇతర ఏర్పాట్లు కోసం వీఎంఆర్డీఏతో కలిసి మరో ప్రాజెక్టు సిద్ధం చేస్తున్నట్టు ఆయన వివరించారు.


నేడు నీట్‌

8,015 మంది అభ్యర్థులు

18 కేంద్రాలు

మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష

మధ్యాహ్నం 1.30 తరువాత అభ్యర్థులకు అనుమతి లేదు

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌

విశాఖపట్నం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి):

వైద్య కళాశాలల్లో (యూజీ) ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) ఆదివారం జిల్లాలోని 18 కేంద్రాల్లో జరగనున్నదని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. పరీక్ష ఏర్పాట్లపై ఆయన శనివారం తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాల వద్ద విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పరీక్ష ప్రారంభం కంటే ముందుగా హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రశ్నపత్రాలు, ఇతర సామగ్రి రవాణా భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌ శాఖ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలోని 18 కేంద్రాల్లో మొత్తం 8,015 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని కలెక్టర్‌ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం ఇవ్వనున్నట్టు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారని, మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్రం గేట్లు మూసివేస్తారని స్పష్టంచేశారు. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవావాలని సూచించారు. సమీక్షా సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీ మణికంఠ, సీఆర్‌పీఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్లు ప్రదీప్‌కుమార్‌ చౌరాసియా, గజేంద్రసింగ్‌ భాటియా, ఉక్కునగరం, వాల్తేరు కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాళ్లు వంశీకృష్ణ, కమలజిత్‌, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 01:08 AM