4 పోల్ మానిటరింగ్ యంత్రాలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:50 PM
నగరంలో వాయు నాణ్యత నమోదుకు కొత్తగా నాలుగు చోట్ల పోల్ మానిటరింగ్ యంత్రాలు ఏర్పాటుచేయనున్నారు.
వాయు నాణ్యత నమోదుకు ఏర్పాటు
విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):
నగరంలో వాయు నాణ్యత నమోదుకు కొత్తగా నాలుగు చోట్ల పోల్ మానిటరింగ్ యంత్రాలు ఏర్పాటుచేయనున్నారు. కొమ్మాది, బాజీ జంక్షన్, లంకెలపాలెం, గాజువాకలో వీటిని ఏర్పాటుచేయాలని కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించింది. ఒక్కో యంత్రం ఏర్పాటుకు సుమారు రూ.రెండు నుంచి రూ.2.5 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతరం పీసీబీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంపై ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్‌క్వాలిటీ స్టేషన్ పనిచేస్తోంది. ఈ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు వాయు నాణ్యత, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అవుతుంటాయి.
నగరంలో మరో పదిచోట్ల ఆఫ్‌లైన్ యంత్రాల ద్వారా వాయు నాణ్యత లెక్కిస్తున్నారు. అయితే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెబ్‌సైట్ జీవీఎంసీ కార్యాలయంపై ఉన్న యంత్రం నమోదు చేసిన వివరాలనే పరిగణలోని తీసుకుంటోంది. ఒక్కచోట నమోదైన వివరాలను నగరం మొత్తానికి నిర్ధారించే విధానం సరికాదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో కనీసం 10 స్టేషన్లు ఏర్పాటుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. విశాఖ పోర్టు యాజమాన్యం ఇటీవల పోర్టు స్టేడియం, బీచ్‌రోడ్డు పోర్టు క్వార్టర్స్, కోరమాండల్ కర్మాగారానికి సమీపంలో ఆయిల్ రిఫైనరీ, హెచ్‌పీసీఎల్ రిఫైనరీ వద్ద ఒకటి ఏర్పాటు చేశారు. త్వరలో ఈ యంత్రాల నుంచి రోజువారీ నమోదైన వాయు నాణ్యత వివరాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనున్నారు. అయితే కొత్తగా నాలుగు పోల్ మానిటరింగ్ స్టేషన్లు త్వరలో ఏర్పాటు చేస్తామని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పీవీ ముకుందరావు తెలిపారు.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
కూర్మన్నపాలెం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):
ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కూర్మన్నపాలెం సమీపంలోని యాతపాలెంలో జరిగింది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
యాతపాలేనికి చెందిన కూండ్రపు వెంకట రామ్ చరణ్ (21) పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఇప్పటివరకు 14 బ్యాక్‌లాగ్స్ ఉండిపోవడంతో వర్సిటీ అతడి నాల్గో ఏడాది ప్రవేశం నిలిపివేసింది. దీంతో ఇటీవల ఇంటికి వచ్చేశాడు. ఏడాది కిందట అతడి తండ్రి మృతి చెందా డు. తల్లి లక్ష్మి కొడుకు, కూతురులను సాకుతోంది. కాగా శనివారం సాయం త్రం రామ్‌చరణ్ తల్లి, చెల్లి అచ్యుతాపురం మండలం భోగాపురంలో ఆస్తి తగాదాకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రామ్‌చరణ్ బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ప్లాస్టిక్ తాడుతో ఉరివేసుకున్నాడు. రాత్రి తిరిగివచ్చిన తల్లి, చెల్లి ఎంతకొట్టినా తలుపుతీయకపోవడంతో స్థానికుల సాయంతో పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో బోరున విలపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు కలెక్టరేట్, సీపీ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్ రద్దు
విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):
గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా సోమవారం కలెక్టరేట్, నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దుచేసినట్టు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, సీపీ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నందున కోడ్ అమల్లో ఉంటుందని, అర్జీదారులు ఈ విషయం గమనించి, వినతులు సమర్పించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని కోరారు.