మన్యానికి 49 ఎన్‌ఆర్‌ఎస్‌టీసీలు
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:14 AM
మన్యానికి 49 నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ)లను సమగ్ర శిక్ష విభాగం మంజూరు చేసింది. వాటిని పాఠశాలలు లేని మారుమూల గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు.
సమగ్ర శిక్ష విభాగం మంజూరు
స్కూళ్లు లేని మారుమూల గిరి పల్లెల్లో ఏర్పాటు
ఈ ఏడాది జూలై నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు నిర్వహణ
బోధనకు అర్హులైన విద్యావలంటీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యానికి 49 నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ)లను సమగ్ర శిక్ష విభాగం మంజూరు చేసింది. వాటిని పాఠశాలలు లేని మారుమూల గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు. ఇటీవల ఏజెన్సీలో విద్యార్థుల స్థితిగతులపై విద్యాశాఖాధికారులు వివరాలు సేకరించారు. ఇందులో భాగంగా ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు లేక కొంతమంది విద్యార్థులు, పాఠశాలలు దూరంగా ఉండడం వల్ల మరికొంత మంది విద్యార్థులు విద్యకు దూరవుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలో ఆయా మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందించడం కోసం ఎన్‌ఆర్‌ఎస్‌టీసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పాఠశాల లేని గ్రామంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అందులోనే విద్యార్థులకు ప్రాథమిక విద్యాబోధన చేస్తారు. ఇందుకు గాను డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థిని విద్యావలంటీర్‌గా నియమించి పది నెలలపాటు అంటే ఈ ఏడాది జూలై నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఎన్‌ఆర్‌ఎస్‌టీసీలను నిర్వహిస్తారు. వాటిని ప్రత్యామ్నాయ పాఠశాలల జిల్లా సమన్వయకర్త జర్రా కూర్మారావు పర్యవేక్షిస్తారు. కాగా గత వైసీపీ ప్రభుత్వం కేవలం 12 మాత్రమే ఎన్‌ఆర్‌ఎస్‌టీసీలను ఏర్పాటు చేయగా, కూటమి ప్రభుత్వం గత ఏడాది 39, ఈ ఏడాది 49 ఎన్‌ఆర్‌ఎస్‌టీసీలను మంజూరు చేసింది. మారుమూల ప్రాంతాల్లో సైతం విద్యాభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతోనే అధిక సంఖ్యలో ఎన్‌ఆర్‌ఎస్‌టీసీలను ప్రభుత్వం మంజూరు చేసిందని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ వీఏ స్వామినాయుడు పేర్కొన్నారు.
ఏజెన్సీలో ఎన్‌ఆర్‌ఎస్‌టీలు ఏర్పాటు చేసే గ్రామాలివే..
మన్యంలో పది మండలాల పరిధిలో ఎంపిక చేసిన 49 గ్రామాల్లో నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఏజెన్సీలో అరకులోయలో కెంటుబడి, చింతపల్లిలో భీమునుపనుకు, లక్కవరం, దిగవలసపల్లి, రామారావుపాలెం, హుకుంపేట మండలంలో ఈదులగరువు, నిమ్మలపాడు, పాతలచింత, గుర్రాలతోట, డుంబ్రిగుడలో బుద్దంగి, కుమిడికుట్టి, జీకేవీధి మండలంలో గుమ్మలగొంది, చింతగుప్ప, కొండపల్లి, వీరవరం, చల్లనిశిల్ప, చెరుకుంపాలెం, దొరగొంది, జి.మాడుగుల మండలంలో జీరుగులగొయ్యి, అడ్డతీగల, సలమరంగి, తడపాలెం, వందనాపల్లి, పెదపొర్లు, నిట్టమామిడి, కొయ్యూరు మండలంలో లోయలపాలెం, పుట్టకోట, నీలవరం, కాకుకులమామిడి, పిట్టలపాడు, బిల్లుపాలెం, కొత్తపల్లి, కొమ్మనూరు, గొందికోట, ముంచంగిపుట్టు మండలంలో బరెంగుల, మెట్టగూడ, మొంజాగూడ, బొర్రపనస, పాడేరు మండలంలో నేరళ్ల, నందిగరువు, వంటివీధుల, జోడూరు, పెదబయలు మండలంలో దుడ్డిపల్లి, కన్నెలకట్టు, బురికిపనస, పిట్టలబొర్ర, లింగేరిపుట్టు, కడబంగి, సుజ్జారి గ్రామాల్లో వాటిని ఏర్పాటు చేస్తారు. ఆయా గ్రామాల్లో డీఎడ్ అర్హత కలిగిన అభ్యర్థులుంటే వారినే విద్యావలంటీర్‌గా నియమిస్తారు. దానిపై ఆసక్తి ఉన్న డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు తమ పరిధిలోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈ నెల 18 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ వీఏ స్వామినాయుడు తెలిపారు.