Share News

నకిలీ ఉత్తర్వులతో చేరిన 49 మందికి ఉద్వాసన

ABN , Publish Date - Jul 22 , 2026 | 10:35 PM

మండలంలో నకిలీ ఉత్తర్వులతో ప్రభుత్వ పాఠశాలల్లో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న వలంటీర్లను విద్యాశాఖ అధికారులు తొలగించారు. సోమవారం ఒకేరోజు పాఠశాలకు హాజరైన నకిలీ ఉద్యోగులు 49 మందికి ప్రధానోపాధ్యాయులు ఉద్వాసన పలికారు.

నకిలీ ఉత్తర్వులతో చేరిన 49 మందికి ఉద్వాసన
విద్యాశాఖ గ్రూప్‌లో ఎంఈవో-1 పోస్టు చేసిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

దిద్దుబాటు చర్యలు చేపట్టిన విద్యాశాఖ అధికారులు

గూడెంకొత్తవీధి, జూలై 22 (ఆంధ్రజ్యోతి):

మండలంలో నకిలీ ఉత్తర్వులతో ప్రభుత్వ పాఠశాలల్లో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న వలంటీర్లను విద్యాశాఖ అధికారులు తొలగించారు. సోమవారం ఒకేరోజు పాఠశాలకు హాజరైన నకిలీ ఉద్యోగులు 49 మందికి ప్రధానోపాధ్యాయులు ఉద్వాసన పలికారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. గూడెంకొత్తవీధి మండలంలో ప్రైవేటు వ్యక్తులు రెండు నెలలుగా నిరుద్యోగ యువతీ, యువకులను సమగ్ర శిక్షణ, భారత్‌ సేవక్‌ సమాజ్‌ పేరిట ఒకేషనల్‌ ట్రైనర్లు, వంటీర్లు(సపోర్టింగ్‌ రోల్‌), అటెండర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, రికార్డు అసిస్టెంట్లు, క్లర్కులుగా నియమిస్తూ నకిలీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ వ్యవహారంపై బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ లో ‘నకిలీ ఉత్తర్వులతో వలంటీర్ల నియామకం’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ వీఏ స్వామినాయుడు స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో అనధికారికంగా పనిచేస్తున్న వలంటీర్లను తక్షణమే తొలగించాలని, లేదంటే ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో సంబంధిత ప్రధానోపాధ్యాయులు నకిలీ ఉత్తర్వులతో విధులు నిర్వహిస్తున్న వలంటీర్లు, అటెండర్లు, క్లర్కు, రికార్డు అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లను పాఠశాల నుంచి బయటకు పంపించేశారు.

Updated Date - Jul 22 , 2026 | 10:35 PM