జీవీఎంసీ ఎన్నికలకు 4,500 మందితో బందోబస్తు
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:05 AM
జీవీఎంసీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు.
177 రూట్ మొబైల్స్, 50 స్ర్టైకింగ్, 15 స్పెషల్ స్ర్టైకింగ్ ఫోర్స్
ఇతర ప్రాంతాల రాజకీయ నాయకులు నగరం విడిచివెళ్లాలి
సీపీ శంఖబ్రతబాగ్చి
విశాఖపట్నం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు. నవంబరు ఒకటిన కమిషనరేట్ పరిధిలోని 1,877 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందన్నారు. కేంద్రాల వద్ద అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు, ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం వంటి వాటికి ఆస్కారం లేకుండా 177 రూట్ మొబైల్స్, 50 స్ర్టైకింగ్ ఫోర్స్, 15 స్పెషల్ స్ర్టైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటుచేశామన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మూడు వేల మంది పోలీసులతోపాటు ఏపీఎస్‌పీ నుంచి పది ప్లాటూన్లు, 600 మంది వలంటీర్లు, వంద మంది రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు, 195 మంది ఇతర శాఖలకు చెందినవారు...మొత్తం 4,500 మంది ఎన్నికల బందోబస్తులో పాల్గొంటారన్నారు. గత వారం రోజుల్లో అన్ని స్ర్టాంగ్ రూమ్‌లు, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా బందోబస్తు ఏర్పాటుచేస్తున్నామన్నారు. రౌడీషీటర్లు, గతంలో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు, రాజకీయ నాయకులు శుక్రవారం సాయంత్రానికి నగరం నుంచి వెళ్లిపోవాల్సిందేనన్నారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచార గడువు ముగుస్తుందని, ఆ తరువాత ఎలాంటి ప్రచారం, ఊరేగింపులు, సభలు నిర్వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. బెదిరింపులు, ప్రలోభాలు, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు ఎదురైతే 7995095799 లేదా కంట్రోల్‌రూమ్ నంబర్ 0891-2565454, 112కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చునన్నారు.