సందిగ్ధంలో 44 వేల ఇళ్లు!
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:01 AM
నగర శివారు ప్రాంతాల్లో గుర్తించిన లేఅవుట్‌లలోని సెంటు భూమిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి.
సెంటు లే అవుట్‌లలో నిర్మాణాలకు నిధుల లేమి
పూర్తిచేసేందుకు రూ.502 కోట్లు అవసరం
బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
పీఎంఏవై 1.0 పథకాన్ని నిలిపివేసిన కేంద్రం
ఆందోళనలో లబ్ధిదారులు
విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):
నగర శివారు ప్రాంతాల్లో గుర్తించిన లేఅవుట్‌లలోని సెంటు భూమిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఏడాదిగా బిల్లులు మంజూరుకాకపోడంతో జిల్లాలోని 65 లేఅవుట్‌లలో 44వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయడంపై సందిగ్ధత నెలకొంది. వీటిని పూర్తిచేసేందుకు రూ.502 కోట్లు అవసరమని (ఆరేళ్ల క్రితం నిర్ణయించిన యూనిట్ ధర మేరకు) అంచనావేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో మొత్తం సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన పరిస్థితి ఎదురయింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) 1.0 కింద రాష్ట్రంలో గత ప్రభుత్వం లక్షల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. ప్రణాళిక లేకుండా పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ప్రారంభించిన ఈ ఇళ్లు సకాలంలో పూర్తిచేయలేక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనికి పెద్ద ఉదాహరణ విశాఖ జిల్లా. నగరంలో గూడులేని పేదల కోసం 1.4 లక్షల ఇళ్ల నిర్మాణాలను జగన్ ప్రభుత్వం ప్రతిపాదించి, పట్టాలు పంపిణీ చేసింది. ఇళ్ల కోసం నగరం చుట్టూ 65లేఅవుట్‌లు అభివృద్ధి చేశారు. సెంటు భూమిలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.1.5 లక్షలు, రాష్ట్రం రూ.30వేలు మొత్తం రూ.1.8 లక్షలు వెచ్చించాలని ప్రతిపాదించారు. అయితే పలు కారణాలతో తొలిదశలో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినా, 82,791 పనులు మాత్రమే ప్రారంభించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలకు లేఅవుట్‌ల్లో కొన్ని స్థలాలు అనువుగా లేకపోవడంతో సుమారు 18 వేల ఇళ్లు పనులు నిలిపివేశారు. నిర్మాణ బాధ్యతలను అప్పటి పాలకులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.1490.24 కోట్లు. ఇప్పటి వరకు రూ.987.36 కోట్లు వెచ్చించి 38,837 ఇళ్లు పూర్తిచేశారు. దీంట్లో మెటీరియల్ కోసం రూ.283.74 కోట్లు, నగదు రూపంలో లబ్ధిదారుల ఖాతాలకు రూ.703.62 కోట్లు విడుదలచేశారు. ఈ నిధులు లబ్ధిదారుల ఖాతాల నుంచి కాంట్రాక్టర్ల ఖాతాలకు బదలాయించారు.
పర్యవేక్షణ లోపంతో...
గత పాలకులు ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించకపోడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కొంతమంది హౌసింగ్ అధికారులు, సిబ్బందితో కలిసి భారీ అవినీతికి పాల్పడ్డారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి, అక్రమాలపై తొలుత దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సుమారు ఏడాదిపాటు నిర్మాణాల పురోగతిని ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఆ తరువాత కొంతమేర నిధులు విడుదలవడంతో పనులు వేగంగా జరిగాయి. గత ఏడాది కేంద్రం నిధుల మంజూరుకు కొత్త పోర్టళ్లు తీసుకురావడం రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలపై ప్రభావం చూపింది. అప్పటివరకు కేంద్రం ఇచ్చిన సొమ్ములో మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. సుమారు ఏడాదిగా బిల్లులు అందకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్రమత్తమైన హౌసింగ్ అధికారులు నిర్మాణాలు పూర్తైన ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. కాగా 44 వేల ఇళ్ల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వీటిని పూర్తిచేసేందుకు రూ.502 కోట్లు అవసరమని లెక్కలు కట్టారు.
ఇదిలావుండగా పీఎంఏవై 2.0ను కేంద్రం అమల్లోకి తేవడంతో పీఎంఏవై 1.0 రద్దుచేసినట్టు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో పీఎంఎవై 2.0 కింద మంజూరుచేసిన ఇళ్లకు మాత్రమే నిధులు వచ్చే అవకాశముంది. అంతకుముందు అసంపూర్తి నిర్మాణాలకు విడుదల చేసే వీలు లేదు. దీంతో జిల్లాలోని 44వేల ఇళ్ల పూర్తికి అవసరమయ్యే రూ.502 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమూ భరించాలి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని, సమస్య పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.