4,36,494
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:40 PM
జిల్లాలో 4 లక్షల 36 వేల 494 మంది ఓటర్లు ఉన్నట్టు అధికార యంత్రాంగం తేల్చింది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం శుక్రవారం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. ఈమేరకు జిల్లాలో మహిళలు 2,25,203, పురుషులు 2,11,271, ఇతరులు 20 మంది మొత్తం 4,36,494 మంది ఓటర్లున్నారని ప్రకటించింది. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈఏడాది జూన్ 14న మొదలైన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఈనెల 24వ తేదీతో ముగిసింది.
ఇదీ జిల్లా ఓటర్ల సంఖ్య
మహిళలు 2,25,203,
పురుషులు 2,11,271, ఇతరులు 20 మంది
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
సర్‌కు ముందు ఓటర్లు 4,99,752 మంది
సవరణ అనంతరం 4,36,494 మంది
గైర్హాజరు, శాశ్వత వలస, మృతులు కలిపి
మొత్తం 63,258 మంది ఓటర్లు
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మొత్తం పదకొండు మండలాల పరిధిలో మొత్తం 4,99,752 మంది ఓటర్లుండగా సర్ ప్రకియలో 4,36, 494 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేశారు. కాగా 63,258 మందికి సంబంధించిన ఫారాలు వివిధ కారణాలతో స్వీకరణ సాధ్యం కాలేదు. జిల్లా వ్యాప్తంగా 34,781 మంది మృతులు, గుర్తించని, శాశ్వత వలస కలిసి మొత్తం 28,477 మంది ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. జిల్లాలోని పాడేరు అసెంబ్లీ స్థానంలో మొత్తం 2,21,485 ఓటర్లకు గానూ పురుషులు 1,06,049 మంది, మహిళలు 1,15,042 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు. అరకులోయ అసెంబ్లీ స్థానంలో మొత్తం 2,15,009 మంది ఓటర్లకు గానూ పురుషులు 1,05,222 మంది, మహిళలు 1,09,781 మంది, ఇతరులు 6 మంది ఉన్నారు.
మరో 27 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదన
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 624 పోలింగ్ కేంద్రాలుండగా హేతుబద్దీకరణలో భాగంగా మరో 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు అవసరమని అధికారులు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ కేంద్రాలు సైతం పలువురు ఓటర్లకు దూరమయ్యాయి. ఈక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి పలుమార్లు నిర్వహించిన సమావేశాల్లో పోలింగ్ కేంద్రాల సమస్యలను తెలిపారు. దీంతో పోలింగ్ కేంద్రాల అవసరాలు గుర్తించిన అధికారులు కొత్తగా మరో 27 చోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జిల్లాలోని పాడేరు అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం 318 పోలింగ్ కేంద్రాలుండగా, మరో 14 అవసరమని, అరకులోయ అసెంబ్లీ స్థానంలో ప్రస్తుతం 306 ఉండగా, మరో 13 ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాటికి ఎన్నికల కమిషన్ అనుమతి లభిస్తే జిల్లాలో మొత్తం 651 పోలింగ్ కేంద్రాలుంటాయి.
అక్టోబరు 3న తుది ఓటరు జాబితా
జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించిన అధికారులు ఇప్పటి నుంచి ఆగస్టు 30 వరకు ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన జరుపుతారు. మృతులు, వలస, తదితర ఓటర్లు తమ అభ్యంతరాలను తెలపవచ్చు. సెప్టెంబరు 28 నాటికి ఆయా అభ్యంతరాలను అధికారులు పరిష్కరిస్తారు. ఆయా మొత్తం ప్రక్రియలు పూర్తి చేసి ఈఏడాది అక్టోబరు 3న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
జిల్లాలో మండలాల వారీగా ముసాయిదా ఓటర్ల వివరాలు.....
వ.సం మండలం పోలింగ్ కేంద్రాలు మొత్తం ఓటర్లు
1.ముంచంగిపుట్టు 53 32,585
2. పెదబయలు 53 37,664
3. హుకకుంపేట 57 39,694
4. డుంబ్రిగుడ 49 34,103
5. అరకులోయ 59 38,732
6. అనంతగిరి 48 32,231
7. జీకేవీధి 66 47,683
8. కొయ్యూరు 57 37,173
9. చింతపల్లి 80 59,848
10. జి.మాడుగుల 62 39,979
11. పాడేరు 67 36,802
----------------------------------------------------------------------------------
మొత్తం 651 4,36,494
-----------------------------------------------------------------------------------