4 థీమ్ బేస్డ్ టౌన్‌షిప్‌లు
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:47 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) థీమ్ బేస్డ్ టౌన్‌షిప్‌ల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. ఇప్పటివరకు శాటిలైట్ టౌన్‌షిప్‌లను మాత్రమే అభివృద్ధి చేశారు.
తొలి విడత భీమిలి మండలం కొత్తవలస, పెందుర్తి మండలం శొంఠ్యాంలో అభివృద్ధికి చర్యలు
మలి విడతలో మరో రెండింటికి కార్యాచరణ
పెట్టుబడుల ఆకర్షణ.. ఉపాధి అవకాశాల పెంపే ధ్యేయం
నైట్ ఫ్రాంక్ సంస్థకు డీపీఆర్ తయారీ బాధ్యత
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) థీమ్ బేస్డ్ టౌన్‌షిప్‌ల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. ఇప్పటివరకు శాటిలైట్ టౌన్‌షిప్‌లను మాత్రమే అభివృద్ధి చేశారు. తాజాగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని, భారీ పెట్టుబడులను ఆకర్షించి, వాటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందించే విధంగా థీమ్ బేస్డ్ టౌన్‌షిప్‌లను తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా మొత్తం నాలుగింటికి ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతానికి భూమి అందుబాటులో ఉన్న కొత్తవలస (భీమిలి మండలం)లో 130 ఎకరాలు, శొంఠ్యాం (ఆనందపురం)లో 165 ఎకరాల్లో వీటిని అభివృద్ధి చేయనున్నారు.
విశాఖపట్నం ఐటీ, పర్యాటకం, విద్య, ఆరోగ్య రంగాల్లో దూసుకెళుతోంది. వీటికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ఒక్కో టౌన్‌షిప్‌ను ఒక్కో రంగానికి కేటయించి, ఆయా పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, సేవా సంస్థలను రప్పిస్తారు. వాటి ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచుతారు. ప్రాథమికంగా చిత్ర పరిశ్రమ - మీడియా, హెల్త్ వేలీ- వెల్‌నెస్ విశాఖ, ఎడ్యుకేషన్ - నాలెడ్జ్ హబ్, టూరిజం- రిక్రియేషన్ సెంటర్లు, ఐటీ హబ్ రంగాలకు థీమ్ బేస్డ్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో లగ్జరీ విల్లాలు, అపార్ట్‌మెంట్లు, రిసార్ట్‌లు, గోల్ఫ్ కోర్సులు, కన్వెన్షన్ సెంటర్లు, ఐటీ పార్కులు, ఆఫీస్ స్పేస్, గ్రీన్ ఎనర్జీ వంటివి ఉంటాయి.
డీపీఆర్ తయారీకి రూ.2.22 కోట్లు
థీమ్ బేస్డ్ టౌన్‌షిప్‌లు ఏ విధంగా ఉండాలి? ఆర్థికంగా లాభదాయకంగా మారాలంటే అనుసరించాల్సిన విధానాలు ఏమిటి? నిధుల సమీకరణ ఏ విధంగా చేయాలి? సొంత నిధులు వెచ్చించాలా? పీపీపీలో వెళ్లాలా? ఇంకా కొత్తమోడల్ ఏమైనా అనుసరించాలా? ప్రస్తుత మార్కెట్ పరిస్థితి, భవిష్యత్తు డిమాండ్ వంటివన్నీ అధ్యయనం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారుచేయడానికి సంస్థలను ఆహ్వానించారు. కేపీఎంజీ అడ్వయిజరీ సర్వీసెస్, నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు బిడ్లు వేయగా నైట్ ఫ్రాంక్‌ను ఎంపిక చేశారు. భూమి అప్పగించినప్పటి నుంచి ఏడాది కాలంలో డీపీఆర్ తయారుచేసి ఇవ్వడానికి వీలుగా ఈ సంస్థకు రూ.2.22 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది వచ్చేలోగా జిల్లాలోని మరో రెండు ప్రాంతాలను థీమ్ బేస్ట్ టౌన్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.