రూ.వేయి కోట్లతో 4 ప్రాజెక్టులు
ABN , Publish Date - Mar 24 , 2026 | 01:03 AM
విశాఖ ప్రజలకు ఉపయోగపడే విధంగా వేయి కోట్ల రూపాయలతో నాలుగు ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు పోర్టు ఇన్‌చార్జి చైర్మన్ ఎం.అంగముత్తు వెల్లడించారు.
విశాఖ ప్రజలకు ఉపయోగపడేలా పనులు
పోర్టు ఆస్పత్రిలో ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తాం
నగరవాసులకు కూడా వైద్యం అందిస్తాం
స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
విశాఖ పోర్టు ఇన్‌చార్జి చైర్మన్ ఎం.అంగముత్తు
విశాఖపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ప్రజలకు ఉపయోగపడే విధంగా వేయి కోట్ల రూపాయలతో నాలుగు ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు పోర్టు ఇన్‌చార్జి చైర్మన్ ఎం.అంగముత్తు వెల్లడించారు. నగరంలోని అక్కయ్యపాలెంలో పోర్టు ఆస్పత్రి సమీపాన 17 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పోర్టుకు దూరంగా సరకు రవాణా, ఎగుమతి, దిగుమతి వ్యాపారాలకు ఉపయోగపడని భూమిని నిరుపయోగంగా ఉంచడం తగదని, రహేజా గ్రూపునకు ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి లీజుకు ఇచ్చామని వివరించారు. దీని వల్ల విశాఖపట్నం ప్రజలకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. పది వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మాల్ కోసం రూ.35 కోట్లతో ప్రత్యేకంగా రహదారి నిర్మించామని, మొత్తం రూ.100 కోట్లతో అదనపు వసతులు కల్పించామన్నారు. ఇవన్నీ నగర ప్రజలకు ఉపయోగపడతాయన్నారు. పోర్టు గోల్డెన్ జూబ్లీ ఆస్పత్రి ఇప్పుడు 80-100 పడకలతో నడుస్తున్నదని, త్వరలో దీనిని 300 పడకలకు పెంచుతామని, ఆధునిక వైద్య సౌకర్యాలను పోర్టు నిధులతో కల్పిస్తామని స్పష్టంచేశారు. అందులో నగర ప్రజలకు కూడా సరసమైన ధరలతో వైద్యం అందించే ఏర్పాటు చేస్తామన్నారు. అందమైన పార్క్‌ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. నాలుగో ప్రాజెక్టుగా పోర్టు స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేసి నగర ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామన్నారు. వీటన్నింటికి రాబోయే ఐదేళ్లలో వేయి కోట్ల రూపాయలు వెచ్చించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పోర్టు స్థలాలను వృథా చేయకుండా, ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా, స్థానికులకు ఉపాధి లభించేలా వెర్టికల్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఇనార్బిట్ మాల్ సీఈఓ రజనీశ్ మహాజన్ పాల్గొన్నారు.