Share News

3,600

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:24 AM

జీవీఎంసీ పరిధిలోని వివిధ లేఅవుట్‌లలో నిర్మించిన ఏపీ టిడ్కో గృహ సముదాయాల్లోని 3,600 ఇళ్లను సోమవారం లబ్ధిదారులకు అందించనున్నట్టు జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ తెలిపారు.

3,600

నేడు లబ్ధిదారుల చేతికి టిడ్కో గృహాలు

నియోజకవర్గాలవారీగా అందించనున్న ఎమ్మెల్యేలు

విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలోని వివిధ లేఅవుట్‌లలో నిర్మించిన ఏపీ టిడ్కో గృహ సముదాయాల్లోని 3,600 ఇళ్లను సోమవారం లబ్ధిదారులకు అందించనున్నట్టు జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశామని వివరించారు.

పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా ఇంటి సదుపాయం కల్పించే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నగర పరిధిలోని 21 లేఅవుట్లలో 24 వేల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టిడ్కో ఇళ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులకు అందజేయడం సాధ్యపడలేదు. తిరిగి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించి, సత్వరం నిర్మాణాలు పూర్తిచేయడంతోపాటు మౌలికసదుపాయాల కల్పనపై దృష్టిసారించింది.

ఈ మేరకు భీమిలి నియోజకవర్గ పరిధి కొమ్మాదిలోరూ.30.55 కోట్లతో నిర్మించిన 336 ఫ్లాట్లు, పెందుర్తి నియోజకవర్గం పరిధి మంత్రిపాలెం వద్ద రూ.33.6 కోట్లతో నిర్మించిన 336 ఫ్లాట్‌లు, గాజువాక నియోజకవర్గం తలారివానిపాలెం, దువ్వాడ, పెదగంట్యాడ ప్రాంతాల్లో రూ.25.88 కోట్ల వ్యయంతో నిర్మించిన 2,928 ఫ్లాట్‌లను సోమవారం లబ్ధిదారులకు అందించాలని జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎంఎన్‌హరేంధిరప్రసాద్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు. టిడ్కో, జీవీఎంసీ అధికారులతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తామని జీవీఎంసీ ప్రత్యేకాధికారి తెలిపారు.


స్క్రాప్ దుకాణంలో అగ్ని కీలలు

ప్రమాదంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు దగ్ధం

పరిసరప్రాంతాలను కమ్మేసిన పొగ

తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పిన ఫైర్‌ సిబ్బంది

విశాఖపట్నం/మహారాణిపేట, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

వన్‌టౌన్‌ కొత్తరోడ్డు సమీపంలోని స్ర్కాప్‌దుకాణంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంబంధించింది. ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం వెనుక ఉన్న స్ర్కాప్‌ దుకాణం ఆదివారం కావడంతో తెరుచుకోలేదు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో దుకాణం నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు, అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.

అగ్నిమాపకశకటాలు ప్రమాదస్థలికి చేరుకుని మంటలను ఆర్పడం ప్రారంభించాయి. అయితే యార్డులో ప్లాస్టిక్‌వ్యర్థాలతోపాటు ఇనుపతుక్కుకు మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. యార్డుకి అనుకుని టింబర్‌డిపో, పెట్రోల్‌బంక్‌ ఉండడంతో వాటికి మంటలు వ్యాపిస్తే ప్రమాదతీవ్రత పెరిగిపోతుందని అగ్నిమాపక శాఖ, పోలీసులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి తొమ్మిది గంటల వరకు మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపకశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, టీడీపీ సౌత్‌ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌ తదితరులు ఘటనా స్దలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తోనే ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.


విమ్స్‌లో క్యాథ్‌ ల్యాబ్‌.?

ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు

కేజీహెచ్‌లో పీపీపీ విధానంలో నిర్వహణ

కార్యరూపం దాల్చితే నిరుపేద రోగులకు మేలు

కేజీహెచ్‌పై తగ్గనున్న ఒత్తిడి

విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇక్కడ క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటుకు ఏళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొత్త క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటుచేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో విమ్స్‌ అధికారులు మళ్లీ ప్రయత్నాలను ప్రారంభించారు. క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటుకు భవనాలు, సిబ్బంది ఉన్నారని, విమ్స్‌లో ఏర్పాటు చేస్తే నిరుపేద రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని చెబుతున్నారు.

కేజీహెచ్‌లో ఇప్పటికే పీపీపీ విధానంలో క్యాథ్‌ల్యాబ్‌ నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఈల్యాబ్‌లో ఏటా వందలాది మంది నిరుపేద రోగులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు. ప్రైవేటు సంస్థ కార్డియాలజీ విభాగంలో క్యాథ్‌ల్యాబ్‌ను ఏర్పాటుచేసింది. శస్త్రచికిత్సల నిర్వహణకు అవసరమైన పరికరాలను ఆ సంస్థ ఏర్పాటు చేసింది. ఇక్కడికి వచ్చే రోగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంది. ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకంలో భాగంగా చెల్లించే మొత్తాలను ఈ సంస్థ క్లైయిమ్‌ చేసుకుంది. దీనివల్ల రోగులకు మెరుగైన సేవలను నాణ్యతతో అందించేందుకు అవకాశం ఉంటుంది. ఏటా పదుల సంఖ్యలో రోగులకు కేజీహెచ్‌ క్యాథ్‌ల్యాబ్‌ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.

ఈ చికత్సలకు వీలు

క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటైతే యాంజియోగ్రామ్‌, యాంజియో ప్లాస్టీ, పేస్‌మేకర్‌ ఇంప్లాంటేషన్‌, వాల్వ్‌ రిపేర్‌ / రిప్లేస్‌ మెంట్‌ వంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విమ్స్‌లో నలుగురు కార్డియాలజిస్టులు, ఇద్దరు న్యూరాలజిస్టులు, ఇద్దరు న్యూరో సర్జన్లు ఉన్నారు. కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ను నియమిస్తే క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు వద్ద ప్రస్తావించగా క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా గుండెకు సంబంధించిన వైద్యసేవలు అందించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు.

Updated Date - Mar 30 , 2026 | 01:24 AM