35 బహుళ ప్రయోజన భవనాలు సిద్ధం
ABN , Publish Date - Sep 20 , 2026 | 10:26 PM
జిల్లాలో ఆదిమ జాతి గిరిజనుల కోసం ప్రధానమంత్రి జన్‌మన్ యోజనలో బహుళ ప్రయోజన భవనాలను ప్రభుత్వం నిర్మించింది.
జన్‌మన్ పథకంలో రూ.21 కోట్లతో ఆదిమజాతి గిరిజన గ్రామాల్లో నిర్మాణం
అందులోనే అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల, హెల్త్ సెంటర్‌ల ఏర్పాటుకు అవకాశం
ఆదిమజాతి గిరిజనులు హర్షం
పాడేరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఆదిమ జాతి గిరిజనుల కోసం ప్రధానమంత్రి జన్‌మన్ యోజనలో బహుళ ప్రయోజన భవనాలను ప్రభుత్వం నిర్మించింది. ఏజెన్సీలో ఆదిమ జాతి గిరిజనులు జీవనం సాగించే పల్లెలు మారుమూల ప్రాంతాల్లో ఉండడం, అక్కడ సరైన వసతులు లేకపోవడంతో పాఠశాల, అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుకు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈక్రమంలో పీఎం జన్‌మన్ యోజనలో ఎంపిక చేసిన 35 ఆదిమ జాతి గిరిజన గ్రామాల్లో ఒక్కో బహుళ ప్రయోజన భవనానికి రూ.60 లక్షలతో నిర్మించారు. జిల్లాలో రూ.21 కోట్లతో 35 భవనాలను నిర్మించడంతో ఆయా గ్రామాల్లో పాఠశాల, అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రం వంటివి ఒకేచోట ఒకే భవనంలో ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడుతున్నది. దీంతో మారుమూల ఆదిమ జాతి గిరిజన గ్రామాలకు విద్య, వైద్య, మహిళా,శిశు సంక్షేమ శాఖ సేవలు సైతం అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆదిమ జాతి గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం వారికి బహుళ ప్రయోజన భవనాలను సమకూర్చడంపై ఆదిమ జాతి గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.