Share News

33 పంచాయతీలు ఏకగ్రీవం

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:10 AM

జిల్లాలో రెండో దశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఒక్క నామినేషన్‌ మాత్రమే మిగిలిన సర్పంచ్‌, వార్డు పదవులు ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో పర్పంచ్‌, వార్డు పదవులకు పోటీలో వున్న అభ్యర్థుల వివరాలను వెల్లడించారు.

33 పంచాయతీలు ఏకగ్రీవం

మునగపాక మండలంలో అత్యధికంగా ఎనిమిది...

పాయకరావుపేట మండలంలో 3, కోటవురట్ల మండలంలో 4, నక్కపల్లి మండలంలో 4, ఎస్‌.రాయవరం మండలంలో 5, ఎలమంచిలి-3, రాంబిల్లి-4, అచ్యుతాపురం-2

ఒక్కరు మినహా మిగిలిన వారందరూ కూటమి మద్దతుదారులే...

రెండో విడత పంచాయతీల్లో

ముగిసిన నామినేషన్ల ఘట్టం

179 సర్పంచ్‌ పదవులకు 390 మంది పోటీ

501 వార్డు పదవులు సైతం పోటీ లేకుండా ఎన్నిక

1,569 వార్డులకు 3,365 మంది పోటీ

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలో రెండో దశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఒక్క నామినేషన్‌ మాత్రమే మిగిలిన సర్పంచ్‌, వార్డు పదవులు ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో పర్పంచ్‌, వార్డు పదవులకు పోటీలో వున్న అభ్యర్థుల వివరాలను వెల్లడించారు.

జిల్లాలోని ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక, పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, కోటవుటర్ల మండలాల్లోని 213 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులకు ఎన్నికల నిర్వహణకు ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. తరువాత పరిశీలన, అప్పీళ్లు, పరిష్కారం అనంతరం మంగళవారం సాయంత్రం మూడు గంటలతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 213 సర్పంచ్‌ పదవులకుగాను 33 సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో ఒకటి మినహా మిగిలినవన్నీ కూటమి మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. అత్యధికంగా మునగపాక మండలంలో ఎనిమిది సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. పాయకరావుపేట మండలంలో 3, కోటవురట్ల మండలంలో 4, నక్కపల్లి మండలంలో 4, ఎస్‌.రాయవరం మండలంలో 5, ఎలమంచిలి-3, రాంబిల్లి-4, అచ్యుతాపురం-2 సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 179 సర్పంచ్‌ పదవులకు 390 మంది పోటీ పడుతున్నారు. రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం సర్పంచ్‌ పదవిని ఎస్సీలకు రిజర్వు చేశారు. కానీ ఈ పంచాయతీలో ఎస్సీ ఓటర్లు లేకపోవడంతో సర్పంచ్‌ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 2,072 వార్డులకుగాను 501 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,569 వార్డులకు 3,365 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. రాంబిల్లి మండలంలో రిజర్వేషన్‌ సమస్య కారణంగా రెండు వార్డులకు ఎన్నికలు జరగడంలేదు. రెండో దశలో ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఈ నెల 29వ తేదీన పోలింగ్‌, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వుంటాయి.

ఏకగ్రీవ పంచాయతీల సర్పంచులు వీరే...

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

పాయకరావుపేట మండలంలో మూడు పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డు పదవులు ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గుంటపల్లి సర్పంచ్‌గా యల్ల నాగేశ్వరరావు (జనసేన మద్దతు)తోపాటు మొత్తం పది వార్డులు, కేశవరం సర్పంచ్‌గా రోకళ్ల చంద్రావతి (టీడీపీ మద్దతు)తోపాటు మొత్తం ఎనిమిది వార్డులు, శ్రీరాంపురం సర్పంచ్‌గా చింతాకుల సురేఖ (టీడీపీ మద్దతు)తోపాటు మొత్తం 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

నక్కపల్లి మండలం వేంపాడు సర్పంచ్‌గా పల్లా రాంబాబు (టీడీపీ మద్దతు)తోపాటు మొత్తం 12 వార్డులూ ఏకగ్రీవమయ్యాయి. సీహెచ్‌ఎల్‌ పురం సర్పంచ్‌గా కఠారి జ్యోతి (టీడీపీ మద్దతు)తోపాటు ఎనిమిది వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఉద్దండపురంలో సర్పంచ్‌గా ఆవాల మణి (టీడీపీ మద్దతు)తోపాటు 12 వార్డులకుగాను 11 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సీహెచ్‌బీ అగ్రహారం సర్పంచ్‌గా షేక్‌ మీరా (టీడీపీ మద్దతు)తోపాటు ఎనిమిది వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

కోటవురట్ల మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌గా జానకి ఇందిర (టీడీపీ మద్దతు) ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. మొత్తం 14 వార్డులకు 13 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. టి.జగ్గంపేట పంచాయతీ సర్పంచ్‌గా గంటిమాల సింహచలం (టీడీపీ మద్దతు)తోపాటు మొత్తం ఎనిమిది వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కె.వెంకటాపురం పంచాయతీ సర్పంచ్‌గా ఇత్తంశెట్టి తిరుమలరావు (టీడీపీ మద్దతు)తోపాటు 12 మంది వార్డు సభ్యులు, బీకేపల్లి పంచాయతీ సర్పంచ్‌గా పెదపూడి లోవరాజు (టీడీపీ మద్దతు)తోపాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎస్‌.రాయవరం మండలంలో ఐదు పంచాయతీల సర్పంచ్‌ పదవులు, పలు పంచాయతీల్లో 74 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. తిమ్మాపురం మేజరు పంచాయతీ సర్పంచ్‌గా సేనాపతి కమలకుమారి (జనసేన మద్దతు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ మొత్తం 14 వార్డులకుగాను తొమ్మిది వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. చినగుమ్ములూరు పంచాయతీ సర్పంచ్‌గా రామాయణపు లక్ష్మి (టీడీపీ మద్దతు)తో మొత్తం పది వార్డు పదవులు, సైతారుపేట సర్పంచ్‌గా రావి వెంకటసాయిలక్ష్మి (టీడీపీ మద్దతు)తోపాటు పది వార్డుల, పేటసూదిపురం సర్పంచ్‌గా పితాన అప్పన్న (టీడీపీ మద్దతు)తోపాటు మొత్తం ఎనిమిది వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. పెనుగొల్లు పంచాయతీ సర్పంచ్‌గా ప్రగడ తులసీ (టీడీపీ మద్దతు) ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, ఇక్కడ 12 వార్డులకుగాను ఆరు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

ఎలమంచిలి మండలంలో బయ్యవరం, తురంగలపాలెం, కృష్ణాపురం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. బయ్యవరం సర్పంచ్‌గా గొన్నాబత్తుల నాగేశ్వరరావు (టీడీపీ మద్దతు)తోపాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు, తురంగలపాలెం సర్పంచ్‌గా శానాపతి త్రినాథరావు (జనసేన మద్దతు)తోపాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు, కృష్ణాపురం పంచాయతీ సర్పంచ్‌గా కొలగాని పుష్ప భాస్కరరావు (జనసేన మద్దతు)తోపాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు.

అచ్యుతాపురం మండలం మల్లవరం పంచాయతీ సర్పంచ్‌గా రావి శ్యామల (జనసేన మద్దతు)తోపాటు ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇరువాడ పంచాయతీ సర్పంచ్‌గా భూపతిరాజు ఉమాశేషుకుమారి (జనసేన)తోపాటు ఎనిమిది వార్డులూ ఏకగ్రీవం అయ్యాయి.

రాంబిల్లి మండలం మర్రిపాలెం సర్పంచ్‌గా మంచాల దొరబాబు (టీడీపీ మద్దతు)తోపాటు మొత్తం ఎనిమిది వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. పెదకవలాపల్లి సర్పంచ్‌గా కర్రి దేవి (టీడీపీ మద్దతు)తోపాటు మొత్తం పది వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కుమ్మరాపల్లి సర్పంచ్‌గా చొచ్పుపట్ల మల్లప్పదొర (టీడీపీ)తోపాటు పంచాయతీలో ఎనిమిది వార్డులకుగాను ఏడు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కొత్తూరు పంచాయతీ సర్పంచ్‌గా కోన తిరుమలరావు (జనసేన మద్దతు)తో మొత్తం పది వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కాగా కొప్పుగొండుపాలెం సర్పంచ్‌ పదవిని ఎస్సీలకు రిజర్వు చేశారు. కానీ ఈ పంచాయతీలో ఎస్సీ ఓటర్లు లేకపోవడంతో సర్పంచ్‌ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు.

మునగపాక సర్పంచ్‌గా ఆడారి యశోద (జనసేన మద్దతు), తిమ్మరాజుపేట సర్పంచ్‌గా బొడ్డేడ వెంకటరమణ (టీడీపీ మద్దతు), రాజుపేట సర్పంచ్‌గా దుబాసి చంద్రకళ (జనసేన మద్దతు), నాగవరం సర్పంచ్‌గా పాలిపిని నిరోషా (జనసేన మద్దతు), ఒంపోలు సర్పంచ్‌గా ద్వారం కనకవరలక్ష్మి (వైసీపీ మద్దతు), నారాయుడుపాలెం సర్పంచ్‌గా కొయ్య వెంకట అప్పారావు (జనసేన మద్దతు), రామగిరి సర్పంచ్‌గా పల్లా రమేశ్‌ (టీడీపీ మద్దతు), చెర్లోపాలెం సర్పంచ్‌గా కాయల సత్యవతి (జనసేన మద్దతు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఈ ఎనిమిది పంచాయతీల్లోని వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి.

-------

మూడో విడత నామినేషన్లకు ముగిసిన పరిశీలన

అనకాపల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడో దశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీలో మంగళవారం నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. ఎనిమిది మండలాల్లో సర్పంచ్‌ పదవులకు 1,204, వార్డుల స్థానాలకు 5,558 నామినేషన్లు సక్రమంగా వున్నట్టు అధికారులు ప్రకటించారు.

నర్సీపట్నం మండలంలో సర్పంచ్‌ స్థానాలకు 58 నామినేషన్లు దాఖలుకాగా రెండు తిరస్కరణకు గురయ్యాయి. 124 వార్డులకు 355 నామినేషన్లు దాఖలు కాగా, మూడు తిరస్కరణకు గురయ్యాయి. మాకవరపాలెం మండలంలో సర్పంచ్‌ పదవులకు 207 నామినేషన్లు వేయగా వీటిలో 54 నామినేషన్లను తిరస్కరించారు. వార్డులకు 1,042 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో 19 నామినేషన్లు తిరస్కరించారు. చీడికాడ మండలంలో సర్పంచ్‌ స్థానాలకు 145 నామినేషన్లు దాఖలు కాగా, 26 నామినేషన్లను తిరస్కరించారు. వార్డులకు 667 నామినేషన్లు వేయగా 20 నామినేషన్లను తిరస్కరించారు. దేవరాపల్లి మండలంలోసర్పంచ్‌ పదవులకు 147 నామినేషన్లకుగాను 10, వార్డులకు 881 నామినేషన్లకు గాను మూడు తిరస్కరించారు. నాతవరం మండలంలో సర్పంచ్‌ పదవులకు 223 నామినేషన్లకుగాను 37, వార్డులకు 1,131 నామినేషన్లనకుగాను 35, కె.కోటపాడు మండలంలో సర్పంచ్‌ పదవులకు 172 నామినేషన్లకుగాను 14, వార్డులకు 770 నామినేషన్లకుగాను నాలుగు తిరస్కరించారు. మాడుగుల మండలంలో సర్పంచ్‌ పదవులకు 198 నామినేషన్లు వేయగా, 25 నామినేషన్లను తిరస్కరించారు. వార్డులకు 887 నామినేషన్‌లు దాఖలు కాగా 17 నామినేషన్లను తిరస్కరించారు.

-----

మొదటి దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం

నేడు పోలింగ్‌ సామగ్రి పంపిణీ

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలో మొదటి దశలో ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల పరిధిలోని గ్రామపంచాయతీల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనకాపల్లి, కశింకోట, సబ్బవరం, పరవాడ, చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లోని 215 పంచాయతీల్లో ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏకగ్రీవం అయిన పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు పదవులు మినహా మిగిలిన పదవులకు గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం అవుతుంది. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది బుధవారం ఉదయం ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు వెళ్లి, ఎన్నికల సామగ్రి తీసుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకొని పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను రాత్రికల్లా పూర్తిచేస్తారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. భోజన విరామం తరువాత సుమారు రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఫలితాలను ప్రకటిస్తారు. విజేతలకు ధ్రువీకరణపత్రాలను అందజేస్తారు. అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. కాగా ఎన్నికలు జరిగే మండలాల పరిధిలోని మద్యం దుకాణాలను మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేస్తున్నట్టు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.

Updated Date - Nov 25 , 2026 | 01:10 AM