33 కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:29 PM
ఒడిశాలో కొనుగోలు చేసి కడపకు రవాణా చేస్తున్న 33 కిలోల గంజాయితో నలుగురిని అరెస్టు చేసినట్టు కొయ్యూరు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు.
నలుగురి అరెస్టు.. ఒకరి పరారీ
ఆటో, ద్విచక్రవాహనంతోపాటు
నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం
కొయ్యూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):
ఒడిశాలో కొనుగోలు చేసి కడపకు రవాణా చేస్తున్న 33 కిలోల గంజాయితో నలుగురిని అరెస్టు చేసినట్టు కొయ్యూరు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సీఐ అందించిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని బూదరాళ్ల మీదుగా చీడిపల్లి కూడలి నుంచి గంజాయి రవాణా జరుగుతున్నట్టు కొయ్యూరు ఎస్‌ఐ కిశోర్‌వర్మకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ తన సిబ్బందితో చీడిపాలెం కూడలి వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో ఆటోతోపాటు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తులు పోలీసులను గుర్తించి వాహనాలను వెనక్కి తిప్పి పరారయ్యే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకొని తనిఖీ చేశారు. ఆటోలో రెండు గోనె సంచులలో గంజాయిని గుర్తించారు. వారిని విచారించగా ఒడిశా నుంచి కడప తరలిస్తున్నట్టు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న చింతపల్లి మండలం అన్నవరం సమీప తుమ్మెంగులకు చెందిన మాసాడ బాబ్జీ, జి. మాడుగులకు చెందిన మహిళ పాంగి సింహాచలం, మాకవరపాలెం మండలం వజ్రగడకు చెందిన రాజబాబు, కడపకు చెందిన ప్రతాప్ రెడ్డిలను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా పాంగి కేశవరావు పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని సీఐ శ్రీనివాసరావు చెప్పారు. పట్టుబడిన వారి వద్ద నుంచి 33 కిలోల గంజాయి, ఆటో, ద్విచక్రవాహనం, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు.