Share News

308 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:29 PM

మండలంలోని కోటగున్నలు గ్రామంలో పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి సిద్ధం చేసిన 308 కిలోల గంజాయిని అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు.

308 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయి, నిందితులతో ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా, సీఐ వినోద్‌కుమార్‌, ఎస్‌ఐలు

ఇద్దరి అరెస్టు

నలుగురు పరారీ

చింతపల్లి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోటగున్నలు గ్రామంలో పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి సిద్ధం చేసిన 308 కిలోల గంజాయిని అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. మంగళవారం చింతపల్లి పోలీసు కార్యాలయంలో దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నర్సీపట్నం నీలంపేటకు చెందిన అడుగుల ప్రకాశ్‌కుమార్‌ గంజాయి రవాణలో కీలక పాత్ర పోషిస్తున్నాడన్నారు. గంజాయిని సేకరించి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటాడని తెలిపారు. కోటగున్నల గ్రామానికి చెందిన పాంగి చంటి, వంతల నగేశ్‌లు ఒడిశా నుంచి గంజాయిని సేకరించి కోటగున్నలు గ్రామానికి తీసుకొస్తుంటే అడుగుల ప్రకాశ్‌కుమార్‌ అదును చూసి పొరుగు రాష్ట్రాల స్మగ్లర్లకు ఎగుమతి చేస్తుంటాడని తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం కోటగున్నలు గ్రామానికి చెందిన చంటి, నగేశ్‌లు ఒడిశా రాష్ట్రం చిత్రకొండ బ్లాక్‌ పరిధి దగుపల్లి గ్రామంలో ముగ్గురు వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేశారన్నారు. గంజాయిని ఒడిశా నుంచి తరలించేందుకు వాగు దాటాల్సిన పరిస్థితి ఏర్పడడంతో జుర్రెల మీదుగా కోటగున్నలు గ్రామానికి తీసుకొచ్చారన్నారు. ఈ విషయం తెలుసుకున్న అన్నవరం ఎస్‌ఐ సాయిరామ్‌, వీఆర్వోలు, పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించారని చెప్పారు. చంటి, నగేశ్‌లు గంజాయి బస్తాలను విడిచి పెట్టి ద్విచక్ర వాహనాలపై పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకున్నారన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి ఆరుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. గంజాయితో పట్టుబడిన ఏ1 చంటి, ఏ2 నగేశ్‌ను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏ3 అడుగుల ప్రకాశ్‌ కుమార్‌తో పాటు ఒడిశాలో గంజాయి విక్రయించిన ఏ4, ఏ5, ఏ6లు పరారీలో ఉన్నారన్నారు. ఈ గంజాయి రవాణాలో ప్రధాన భూమిక పోషిస్తున్న అడుగుల ప్రకాశ్‌కుమార్‌ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించి గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎం.వినోద్‌బాబు, స్థానిక ఎస్‌ఐలు జి.రాంబాబు, ఎం.వెంకట రమణ, అన్నవరం ఎస్‌ఐ బి. సాయిరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:29 PM