3,000 మంది గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:47 AM
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పనిచేయడానికి రైల్వే ఉద్యోగులు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్‌లో పనిచేయడానికి రైల్వే ఉద్యోగుల ఆసక్తి
అత్యధికులు దక్షిణ మధ్య రైల్వే(సికింద్రాబాద్), తూర్పు కోస్తా రైల్వే జోన్ (భువనేశ్వర్)లో పనిచేస్తున్నవారే...
జనవరి నెలాఖరుకే ఆయా విభాగాల నుంచి నిరభ్యంతర పత్రాలు సమర్పించిన 700 మంది
గెజిట్ వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పనిచేయడానికి రైల్వే ఉద్యోగులు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. జోన్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ వెలువడగానే సిరిపురం జంక్షన్‌లోని ‘ది డెక్’లో ఏర్పాటుచేసిన తాత్కాలిక జోనల్ కార్యాలయం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం అక్కడ వంద మంది వరకు అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత కనీసం 1,300 మందితో ఆపరేషన్ ప్రారంభించాలని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీని కోసం విశాఖ జోన్‌లో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించగా...దేశవ్యాప్తంగా మూడు వేల మందికిపైగా ఉద్యోగులు ఇక్కడకు వస్తామంటూ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు సమర్పించారు. ఈ స్పందనపై రైల్వే అధికారులే ఆశ్చర్యపోతున్నారు. వారిలో అత్యధికులు సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే, భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో పనిచేస్తున్నవారే ఉండడం గమనార్హం. వీరిలో దాదాపు 700 మంది గత జనవరి నెలాఖరుకే ఆయా విభాగాల నుంచి నిరభ్యంతర పత్రాలు కూడా సమర్పించారు. అంటే వారంతా ‘రెడీ టు రిలీవ్’ మూడ్‌లో ఉన్నారు. ఏ క్షణంలో విశాఖపట్నం రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నారు.
చకచకా శాశ్వత నిర్మాణ భవనం పనులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముడసర్లోవలో అప్పగించిన 52 ఎకరాల భూమిలో శాశ్వత జోనల్ కార్యాలయం నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలకు రూ.106.89 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా సిబ్బందికి అవసరమైన క్వార్టర్ల నిర్మాణానికి మరో రూ.158 కోట్లు మంజూరయ్యాయి. జోన్‌లో సుమారు 18 విభాగాలు ఉంటాయి. వాటిలో 17 వేల మంది వరకు పనిచేస్తారు. ఈ జోన్‌లో విశాఖ డివిజన్‌తో పాటు గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లు ఉంటాయి. ఇవన్నీ విశాఖపట్నంలోని జనరల్ మేనేజర్ ఆదేశాల మేరకు పనిచేస్తాయి. ప్రసుత్తం గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల కొత్త జీఎం ఉన్నప్పటికీ, తూర్పు కోస్తా జీఎం ఆదేశాలనే అన్ని డివిజన్ల మేనేజర్లు పాటిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి గెజిట్ నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు.