జిల్లాలో 30 రహదారులు ప్రారంభం
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:07 AM
జిల్లాలో పీఎం జన్‌మన్ పథకం, అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా రూ.70.68 కోట్ల అంచనా వ్యయంతో 30 తారు రోడ్లను నిర్మించామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు.
చాపరాయి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
డుంబ్రిగుడ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పీఎం జన్‌మన్ పథకం, అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా రూ.70.68 కోట్ల అంచనా వ్యయంతో 30 తారు రోడ్లను నిర్మించామని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. డుంబ్రిగుడ మండలం చాపరాయి వద్ద సోమవారం ఆ రోడ్ల శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఇందులో డుంబ్రిగుడ మండలానికి సంబంధించి వంతరాడ- చెలిమరవలస, కోసంగి- పెదపాడు, శెట్టిబంద- బలియాగుడ, పాడేరు, అరకు- కోసంగి, వీజే సౌప్- రంగినివలస, సున్నంమెట్ట- పూజారిపుట్టు, పాడి- దూదిగూడ రోడ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం జన్‌మన్ మొదటి దశలో మంజూరైన 80 రోడ్లలో 30 పూర్తికాగా, మరో 16 పనులు దాదాపు పూర్తయ్యాయని, 34 పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. రెండో దశలో మంజూరైన 20 రోడ్లు, 11 వంతెనల్లో ఒక రోడ్డు పూర్తయిందన్నారు. పీఎంజీఎస్‌వై కింద రూ. 91 కోట్ల అంచనా వ్యయంతో 35 రోడ్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియారి దొన్నుదొర, జనసేన అరకు ఇన్‌చార్జి చిరంజీవి, ఐటీడీఏ అధికారులు, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కోసంగి, పెదపాడు, చంపపుట్టు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.