Share News

డొంకరాయి జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కులు విడుదల

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:04 PM

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని శనివారం ఉదయం నుంచి గోదావరి డెల్టాకు విడుదల చేసినట్టు ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు.

డొంకరాయి జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కులు విడుదల
డొంకరాయి జలాశయం నుంచి రెండు గేట్లు ద్వారా నీటిని గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్న దృశ్యం.

పొల్లూరులో విద్యుదుత్పత్తి ద్వారామరో 4 వేల క్యూసెక్కులు

సీలేరు కాంప్లెక్సులో 6 మిలియన్‌యూనిట్లు విద్యుదుత్పత్తి

ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు

సీలేరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని శనివారం ఉదయం నుంచి గోదావరి డెల్టాకు విడుదల చేసినట్టు ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గోదావరి డెల్టా ప్రాంతంలో ఖరీఫ్‌ పంటల సాగుకు దవలేళ్వరం వద్ద నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో డొంకరాయి నుంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని ఆరు,ఏడు రెండు గేట్ల ద్వారా విడుదల చేస్తున్నామన్నారు. అలాగే పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, మొత్తంగా ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని సీఈ రాజారావు తెలిపారు. ఈనెల 13వ తేదీ వరకు గోదావరి డెల్టాకు డొంకరాయి నుంచి నీటి విడుదల కొనసాగుతుందన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాగు దాటడం గాని, పశువులను, మేకలను వాగులోకి వెళ్లకుండా చూసుకోవాలని డొంకరాయి దిగువ ఉన్న ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్సులోని పొల్లూరు, డొంకరాయి, సీలేరు మూడు జలవిద్యుత్‌ కేంద్రాల్లో రోజుకు 5.2 మిలియన్‌ యూనిట్ల నుంచి 6 మిలియన్‌ యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటాగా 22.0265 టీఎంసీలు, గుంటవాడ, డొంకరాయి జలాశయాల్లో 12.3081 టీఎంసీలతో కలపి మొత్తంగా 34.3346 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు.

Updated Date - Jul 04 , 2026 | 11:04 PM