Share News

రైల్వే స్టేషన్‌కు 299 కోట్లు

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:11 AM

విజయవాడ, హైదరాబాద్‌ల నుంచి వచ్చే రైళ్లు ఇకపై ప్లాట్‌ఫారం ఖాళీ లేదనే కారణంగా దువ్వాడలోనో, మర్రిపాలెం అవుటర్‌లోనే ఆగిపోవు.

రైల్వే స్టేషన్‌కు 299 కోట్లు

కోచింగ్‌ యార్డు రీ మోడలింగ్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌

ఇందులో భాగంగానే అదనంగా 6 ప్లాట్‌ఫారాలు, అదనంగా మరో 6 లైన్లు

పనులు పూర్తయితే ప్లాట్‌ఫారాలు ఖాళీ లేవని ఇకపై రైళ్లు శివార్లలో ఆపాల్సిన అవసరం ఉండదంటున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విజయవాడ, హైదరాబాద్‌ల నుంచి వచ్చే రైళ్లు ఇకపై ప్లాట్‌ఫారం ఖాళీ లేదనే కారణంగా దువ్వాడలోనో, మర్రిపాలెం అవుటర్‌లోనే ఆగిపోవు. రైల్వే టైమ్‌ టేబుల్‌లో సూచించిన సమయం ప్రకారం స్టేషన్‌లో ఉంటాయి. శివార్లలో వెయిటింగ్‌ అనే ప్రస్తావన లేకుండా కోచింగ్‌ యార్డును అభివృద్ధి చేయడానికి కేంద్రం రూ.299 కోట్లు మంజూరుచేసింది.

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సాధించుకున్న తరువాత విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో సమస్యల పరిష్కారానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. మర్రిపాలెంలో రైల్వే కోచింగ్‌ యార్డును రీ మోడలింగ్‌ ద్వారా అభివృద్ధి చేయడానికి కొత్త ప్రాజెక్టు మంజూరుచేసింది. దీనికి రూ.299 కోట్లు మంజూరు చేసింది. ఇంతకు ముందు మూడేళ్ల క్రితం రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణానికి రూ.450 కోట్లు మంజూరుచేసిన సంగతి తెలిసిందే. స్టేషన్‌ టెర్మినల్‌, ప్రయాణికులకు అదనపు వసతులు కల్పించే పనులు చేపట్టారు. అందులోనే అదనపు ప్లాట్‌ఫారాలు, అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. అయితే ఆ నిధులు సరిపోవని ఆ ప్రాజెక్టు నుంచి ప్లాట్‌ఫారాలు, రైల్వే లైన్‌ పనులు తొలగించారు. ఇప్పుడు వాటిని కోచింగ్‌ యార్డు ప్రాజెక్టు పనుల్లో చేర్చారు.

ప్రస్తుతం విశాఖపట్నం స్టేషన్‌ నుంచి రోజుకు సగటున 113 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, వాటి ద్వారా రోజుకు 80 వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ప్లాట్‌ఫారాలు సరిపోవడం లేదు. అదనంగా మరో ఆరు ప్లాట్‌ఫారాలు నిర్మించనున్నారు. వీటిలో కొత్తగా ఎలక్ర్టానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడున్న ఎనిమిది ప్లాట్‌ఫారాలలో ఆరింటిని విస్తరించి, ఆధునికీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లకు అదనంగా మరో ఆరు లైన్లు కొత్తగా నిర్మిస్తారు. ఇప్పుడు స్టేషన్‌కు వచ్చే రైళ్లను కోచింగ్‌ యార్డ్‌కు తరలించడానికి కేవలం రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్యను పెంచుతారు. రైళ్లు అన్నీ సమయానికి స్టేషన్‌కు వచ్చేలా, తిరిగి కచ్చితమైన సమయానికి ఇక్కడి నుంచే బయలుదేరడానికి ఈ సదుపాయాలన్ని ఉపకరిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

రైలు ప్రయాణికులకు అదనపు వసతులు, ర్యాంపులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, తూర్పు వైపు కొత్త ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తారు. విశాఖలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా ఇవన్నీ ఉపకరిస్తాయి.


పలాస-విజయవాడ మధ్య ప్రత్యేక జన సాధారణ్‌ రైళ్లు

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం పలాస-విజయవాడ మధ్య ప్రత్యేక జన సాధారణ్‌ రైళ్లను నడుపుతున్నామని అధికారులు తెలిపారు. పలాస-విజయవాడ (07067) రైలు ఆగస్టు 2 నుంచి 5 వరకు మధ్యాహ్నం రెండు గంటలకు పలాసలో బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున ఒంటి గంటకు విజయవాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ-పలాస ప్రత్యేక రైలు (07068) ఆగస్టు 3 నుంచి 6 వరకు సాయంత్రం 4.30 గంటలకు విజయవాడలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు పలాస చేరుతుంది. ఈ సర్వీసులకు 10 జనరల్‌ బోగీలు, రెండు సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌ కమ్‌ లగేజి కోచ్‌లు ఉంటాయని తెలిపారు.

Updated Date - Aug 01 , 2026 | 01:11 AM