25 టన్నుల యూరియా సీజ్
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:05 AM
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నట్టు రైతులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ విజయకృష్ణన్ స్పందించారు.
దుకాణంలో మూడు వారాలపాటు అమ్మకాలు బంద్
కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నట్టు రైతుల ఫిర్యాదుతో చర్యలు
అచ్యుతాపురం రూరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నట్టు రైతులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ విజయకృష్ణన్ స్పందించారు. సదరు ఎరువుల దుకాణంలో మూడు వారాలపాటు అమ్మకాలు నిలిపివేయాలని, షాపులో వున్న ఎరువులను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఇతర అధికారులు సోమవారం అచ్యుతాపురం సెజ్‌లోని ఏపీఐఐసీ వన్‌స్టాప్ సెంటర్ వద్ద నిర్వహించిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరిగి అనకాపల్లి బయలుదేరి వెళుతూ.. దారిలో తిమ్మరాజుపేట గ్రామంలోని సురేశ్ ఫెర్టిలైజర్స్ దుకాణంలో వద్ద ఆగి, ఎరువుల విక్రయ తీరును పరిశీలించడానికి వెళ్లారు. కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఏపీఎయిమ్స్’ యాప్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నదీ లేనిదీ తనిఖీ చేశారు. ఈ సమయంలో అక్కడ వున్న కొంతమంది రైతులు.. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్.. మూడు వారాలపాటు ఎరువులు విక్రయించొద్దని ఆదేశించారు. అంతేకాక షాపులో ఉన్న సుమారు 25 టన్నుల యూరియాను సీజ్ చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవిని ఆదేశించారు. ఎరువుల దుకాణాల్లో మండల టాస్క్‌ఫోర్సులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అధిక ధరలకు విక్రయించే దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.