Share News

జిల్లాలో 2,446 పోలింగ్‌ కేంద్రాలు

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:16 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 2,446 పోలింగ్‌ కేంద్రాలున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖాధికారులు సోమవారం ప్రకటించారు.

జిల్లాలో 2,446 పోలింగ్‌ కేంద్రాలు
డుంబ్రిగుడ ఎంపీడీవో కార్యాలయంలో తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాను ప్రదర్శిసున్న అధికారులు

244 పంచాయతీల తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాల ప్రదర్శన

అత్యధికంగా కొయ్యూరులో 294, అత్యల్పంగా అరకులోయలో 164 కేంద్రాలు

ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం

కొనసాగుతున్న ఓటర్ల వర్గీకరణ

పాడేరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 2,446 పోలింగ్‌ కేంద్రాలున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖాధికారులు సోమవారం ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో గ్రామ పంచాయతీల్లోని పోలింగ్‌ కేంద్రాల క్రమబద్ధీకరణ, ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల ప్రకటన, తదితర ప్రక్రియలను పూర్తి చేసి తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాల తయారీపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

జిల్లాలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీల వారీగా తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాలను విడుదల చేసి మండల పరిషల్‌ కార్యాలయాల్లో, ఆయా పంచాయతీల్లో అధికారులు సోమవారం ప్రదర్శించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన అభ్యంతరాలను ఈ నెల 29వ తేదీలోపే అధికారులు పరిష్కరించారు. దీంతో రానున్న పంచాయతీ ఎన్నికలు తాజాగా ప్రకటించిన పోలింగ్‌ కేంద్రాల ప్రకారం నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, నిబంధనలు, సూచనలు పాటిస్తూ తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాలను సిద్ధం చేసినట్టు డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌ తెలిపారు.

స్థానిక ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం

స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నాటికే సిద్ధం చేశారు. జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులు, 2,446 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. అలాగే పురుషులు 2,41,447 మంది, మహిళలు 2,56,997 మంది, ఇతరులు 23 మంది కలిపి మొత్తం 4,98,467 మంది ఓటర్లున్నారని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి పీఎస్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 65,374 మంది ఓటర్లుండగా, అనంతగిరిలో అత్యల్పంగా 38,286 మంది ఓటర్లున్నారు. అరకులోయలో 42,725 మంది, డుంబ్రిగుడలో 38,743, జి.మాడుగులలో 44,674, జీకేవీధిలో 52,412, హుకుంపేటలో 45,787, కొయ్యూరులో 43,711, ముంచంగిపుట్టులో 38,895, పాడేరులో 44,536, పెదబయలు మండలంలో 43,324 మంది ఓటర్లున్నారు. కాగా ఈ ఓటరు జాబితాలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఓటర్లను విభజించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖాధికారులు గత వారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 2 వరకు అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం, సెప్టెంబరు 3 నుంచి 6 వరకు ఆయా ఓటర్ల నిర్ధారణకు గ్రామసభల నిర్వహణ, 7న తుది ఓటరు జాబితాల ప్రకటన వంటి ప్రక్రియలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉంది.

జిల్లాలో పంచాయతీల వారీగా తుది పోలింగ్‌ కేంద్రాల వివరాలు

వ.సం మండలం పంచాయతీలు పోలింగ్‌ కేంద్రాలు

1. అనంతగిరి 24 232

2. అరకులోయ 14 164

3. చింతపల్లి 17 304

4. డుంబ్రిగుడ 18 188

5. జీకేవీధి 16 188

6. జి.మాడుగుల 17 188

7. హుకుంపేట 33 282

8. కొయ్యూరు 33 294

9. ముంచంగిపుట్టు 23 228

10. పాడేరు 26 246

11. పెదబయలులో 23 232

------------------------------------------------------------------

మొత్తం 244 2,446

---------------------------------------------------------------------------------

Updated Date - Aug 31 , 2026 | 11:16 PM