Share News

జిల్లాలో 2,446 పోలింగ్‌ కేంద్రాలు

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:32 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 2,446 పోలింగ్‌ కేంద్రాలున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖాధికారులు ఆదివారం ప్రకటించారు.

జిల్లాలో 2,446 పోలింగ్‌ కేంద్రాలు
పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీలో పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రదర్శన

244 పంచాయతీల్లో ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రదర్శన

31న తుది పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రకటన

పాడేరు/కొయ్యూరు, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 2,446 పోలింగ్‌ కేంద్రాలున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖాధికారులు ఆదివారం ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో గ్రామ పంచాయతీల్లోని పోలింగ్‌ కేంద్రాల క్రమబద్ధీకరణ, ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా ప్రకటనలకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 11 మండలాల్లోని 244 గ్రామ పంచాయతీల వారీగా ఆదివారం ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితాలను విడుదల చేసి ఆయా పంచాయతీల్లో అధికారులు ప్రదర్శించారు.

ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలున్నా ఈ నెల 29 నాటికి సంబంధిత అధికారులకు తెలియజేయాలి. వాటిని అధికారులు పరిశీలించి, పరిష్కరించి ఈ నెల 31న తుది పోలింగ్‌ కేంద్రాలను ప్రకటిస్తారు. దీంతో రానున్న పంచాయతీ ఎన్నికలు అవే పోలింగ్‌ కేంద్రాల ప్రకారం నిర్వహిస్తారు. అలాగే తాజాగా ప్రకటించిన ముసాయిదా పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన అభ్యంతరాలుంటే తెలియజేయాలని డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌ తెలిపారు.

జిల్లాలో ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల వివరాలు

జిల్లాలోని పదకొండు మండలాల పరిధిలో 244 గ్రామ పంచాయతీల్లో మొత్తం 2,446 పోలింగ్‌ కేంద్రాలున్నట్లుగా అధికారులు ముసాయిదా జాబితాలను విడుదల చేశారు. ఆవివరాల ప్రకారం.... అనంతగిరిలో 24 పంచాయతీలకు 232 పోలింగ్‌ కేంద్రాలు, అరకులోయలో 14కి 164, చింతపల్లిలో 17కి 304, డుంబ్రిగుడలో 18కి 188, జీకేవీధిలో 16కి 188, జి.మాడుగులలో 17కి 188, హుకుంపేటలో 33కి 282, కొయ్యూరులో 33కి 294, ముంచంగిపుట్టులో 23కి 228, పాడేరులో 26కి 246, పెదబయలులో 23 పంచాయతీలు 232 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.

Updated Date - Aug 23 , 2026 | 11:32 PM