220 కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:52 AM
రావికమతం- అనకాపల్లి రహదారిలో గుడివాడ జంక్షన్ వద్ద పోలీసులు 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి ఇన్‌చార్జి డీఎస్పీ జీఆర్‌ఆర్ మోహన్ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..
ముగ్గురి అరెస్టు, ఐదుగురు పరారీ
అనకాపల్లి టౌన్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రావికమతం- అనకాపల్లి రహదారిలో గుడివాడ జంక్షన్ వద్ద పోలీసులు 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి ఇన్‌చార్జి డీఎస్పీ జీఆర్‌ఆర్ మోహన్ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..
ఒడిశా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాను దాటి రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల మీదుగా గంజాయి రవాణా అవుతున్నట్టు పోలీసులు బుధవారం సాయంత్రం సమాచారం అందింది. దీంతో రావికమతం, బుచ్చెయ్యపేట ఎస్‌ఐలు, సిబ్బంది కలిసి రావికమతం నుంచి అనకాపల్లి వచ్చే రోడ్డులో గుడివాడ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బీఎన్ రోడ్డులో బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడి వైపు నుంచి వస్తున్న రెండు కార్లను ఆపారు. దీంతో వాహనాల్లో వున్న ముగ్గురు వ్యక్తులు కిందకు దిగి, ఒక ఉదుటన పరారయ్యారు. మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని, వాహనాలను తనిఖీ చేశారు. గోనె సంచుల్లో రవాణా చేస్తున్న 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను విచారించగా గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి, చెన్నైకి రవాణా చేస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. నిందితులు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గౌడపుట్టుకు చెందిన కిల్లో తిమోతి, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ, ఫయాజ్‌లుగా గుర్తించి అరెస్టు చేశారు. గంజాయి రవాణా చేస్తున్న వాహనాల్లో నుంచి కిందకు దిగి పరారైన ముగ్గురితోపాటు, పైలట్‌గా ద్విచక్ర వాహనంపై వస్తున్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయితోపాటు రెండు కార్లను సీజ్ చేశారు. మహమ్మద్ రఫీ ఇంతకుముందు పెదబయలులో తిమోతి నుంచి గంజాయి కొనుగోలు చేసి సత్తెనపల్లికి తీసుకువెళ్లి, రెండు రోజుల తరువాత తమిళనాడు రాష్ట్రం హోసూరు (బెంగళూరుకు సమీపంలో) తీసుకువెళ్లి విక్రయించినట్టు పోలీసులు విచారణలో తేలింది. హోసూరులో గంజాయి వ్యాపారి సౌందర్‌పై కేసు నమోదు చేశామని, ఇతనిని త్వరలో అరెస్టు చేస్తామని ఇన్‌చార్జి డీఎస్పీ చెప్పారు. గంజాయితోపాటు నిందితులను పట్టుకున్న రావికమతం ఎస్‌ఐ ఎం.రఘువర్మ, బుచ్చెయ్యపేట ఎస్‌ఐ పి.మనోజ్‌కుమార్, పోలీసు సిబ్బందిని ఎస్పీ తుహిన్‌సిన్హా అభినందించారని ఆయన తెలిపారు. వీరందరికీ నగదు రివార్డు అందజేశారు. మీడియా. సమావేశంలో కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.