22 పంచాయతీలు ఏకగ్రీవం
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:19 AM
జిల్లాలో మూడో దశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. 22 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు పదవులు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే మిగిలడంతో ఇవన్నీ ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో పర్పంచ్, వార్డు పదవులకు ఎంతెంతమంది పోటీ చేస్తున్నారో గణాంకాలను వెల్లడించారు. అయితే అత్యధిక మండలాల్లో సర్పంచ్, వార్డు పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను శనివారం వెల్లడిస్తామన్నారు.
మూడో విడత పంచాయతీల్లో ముగిసిన నామినేషన్ల ఘట్టం
కె.కోటపాడు మండలంలో అత్యధికంగా తొమ్మిది పంచాయతీలు ఏకగ్రీవం
19 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు, ఒకచోట జనసేన, రెండుచోట్ల స్వతంత్రులు సర్పంచులుగా ఎన్నిక
192 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 478 మంది పోటీ
2,046 వార్డులకు 377 వార్డులు ఏకగ్రీవం
1,669 వార్డులకు 3,606 మంది పోటీ
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లాలో మూడో దశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. 22 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు పదవులు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే మిగిలడంతో ఇవన్నీ ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో పర్పంచ్, వార్డు పదవులకు ఎంతెంతమంది పోటీ చేస్తున్నారో గణాంకాలను వెల్లడించారు. అయితే అత్యధిక మండలాల్లో సర్పంచ్, వార్డు పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను శనివారం వెల్లడిస్తామన్నారు.
జిల్లాలోని నర్సీపట్నం, నాతవరం, మాకవరపాలెం, గొలుగొండ, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లోని 212 గ్రామ పంచాయతీలతోపాటు అనకాపల్లి మండలంలోని రెండు గ్రామాపంచాయతీల్లో సర్పంచ్, వార్డు పదవులకు ఎన్నికల నిర్వహణకు ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. తరువాత పరిశీలన, అప్పీళ్లు, పరిష్కారం అనంతరం శుక్రవారం సాయంత్రం మూడు గంటలతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 214 గ్రామపంచాయతీలకుగాను 22 గ్రామపంచాయతీలు (సర్పంచ్, వార్డు పదవులన్నీ) ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో 19 పంచాయతీల్లో టీడీపీ, ఒకచోట జనసేన మద్దతుదారులు ఎన్నికయ్యారు. మరో రెండుచోట్ల స్వంతంత్రులు ఎన్నికయ్యారు. కె.కోటపాడు మండలంలో అత్యధికంగా తొమ్మిది పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. నాతవరం, గొలుగొండ మండలాల్లో ఒక పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు. నర్సీపట్నం మండలంలో 3, మాకవరపాలెం మండలంలో 2, చీడికాడ మండలంలో 4, దేవరాపల్లి మండలంలో 3, మాడుగుల మండలంలో ఒక పంచాయతీ ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 192 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 478 మంది పోటీ చేస్తున్నారు. ఇక వార్డుల విషయానికి వస్తే.. మొత్తం 2,046 వార్డులకుగాను 377 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,669 వార్డులకు 3,606 మంది పోటీ చేస్తున్నారు.
ఏకగ్రీవ పంచాయతీలు ఇవే...
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
నర్సీపట్నం మండలంలో మూడు పంచాయతీల సర్పంచ్, అన్ని వార్డు పదవులు ఏకగ్రీవం అయ్యాయి. వేములపూడి పంచాయతీ సర్పంచ్‌గా మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప తనయుడు బోళెం గోపాత్రుడు (టీడీపీ), గురందరపాలెం సర్పంచ్‌గా రాయి శివ లక్ష్మీకుమారి (టీడీపీ), దుగ్గాడ సర్పంచ్‌గా నల్లబెల్లి చిట్టమ్మ (టీడీపీ)తోపాటు ఆయా పంచాయతీల్లో అన్ని వార్డులు ఏకగ్రీవం అయినట్టు అధికారులు ప్రకటించారు.
మాకవరపాలెం మండలంలో రెండు పంచాయతీల సర్పంచ్, వార్డు పదవులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. భీమబోయినపాలెం పంచాయతీ సర్పంచ్‌గా రుత్తల వీరరత్నం (టీడీపీ), శెట్టిపాలెం సర్పంచ్‌గా అల్లు వెంకటవేణుతోపాటు ఈ పంచాయతీల్లో మొత్తం వార్డు సభ్యులంతా పోటీ లేకుండా ఎన్నికయ్యారు.
చీడికాడ మండలంలో నాలుగు పంచాయతీలు టీడీపీకి ఏకగ్రీవం అయ్యాయి. అప్పలరాజుపురం సర్పంచ్‌గా గవిరెడ్డి రమాదేవి (టీడీపీ), బి.సింగవరం సర్పంచ్‌గా శరగడం లక్ష్మి (టీడీపీ), ఎ.అగ్రహారం సర్పంచ్‌గా గుంపాన సన్నమ్మ (టీడీపీ), ఎల్‌బీ పట్నం సర్పంచ్‌గా కుదర గోవింద (టీడీపీ)లతోపాటు ఆయా పంచాయతీల్లోని అన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
దేవరాపల్లి మండలం ములకలాపల్లి సర్పంచ్‌గా ఇంటి సురేశ్ (జనసేన), గర్శింగి సర్పంచ్‌గా రంసాల భవాని (టీడీపీ), ఎన్.గజపతినగరం సర్పంచ్‌గా కార్లి శ్రావణి (స్వతంత్ర)తోపాటు అన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
మాడుగుల మండలం గాదిరాయి సర్పంచ్‌గా పెంటకోట భవానీ (టీడీపీ)తోపాటు మొత్తం పది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కె.కోటపాడు మండలంలో తొమ్మిది పంచాయతీల సర్పంచ్, వార్డు పదవులు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో ఎనిమిదింటిని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నారు. ఆనందపురం సర్పంచ్‌గా బోజంకి మహేశ్వరి (టీడీపీ), సూరెడ్డిపాలెం సర్పంచ్‌గా సూరెడ్డి యశోద (టీడీపీ), గుల్లేపల్లి సర్పంచ్‌గా రాళ్లపల్లి కృష్ణవేణి (టీడీపీ), చంద్రయ్యపేట సర్పంచ్‌గా సబ్బవరపు అనురాధ (టీడీపీ), రొంగలినాయుడుపాలెం సర్పంచ్‌గా రొంగలి సూర్యనారాయణ (టీడీపీ), కింతాడ సర్పంచ్‌గా కన్నూరు సూర్యనారాయణ (టీడీపీ), ఎ.భీమవరం సర్పంచ్‌గా కె.శ్రీనివాసరావు (టీడీపీ), మర్రివలస సర్పంచ్‌గా బురిడి శ్రీనువాసు (టీడీపీ), గొండుపాలెం సర్పంచ్‌గా చిరికి రవి (స్వతంత్ర) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.