Share News

21,000 ఇళ్లు రద్దు!

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:14 AM

జిల్లాలో నిర్మాణం ప్రారంభం కాని సుమారు 21 వేల ఇళ్లను కేంద్రం గృహ నిర్మాణ శాఖ రద్దు చేసింది. నాలుగేళ్ల క్రితం ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కింద జిల్లాలో గూడు లేని పేదలకు సుమారు 1.4 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి.

21,000 ఇళ్లు రద్దు!

సకాలంలో నిర్మాణం ప్రారంభించకపోవడమే కారణం

పునాదుల్లో ఉన్న ఇళ్లపై ప్రభావం

జియో ట్యాగ్‌ చేయకపోవడం వల్లేనంటున్న లబ్ధిదారులు

మరో అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలనే యోచనలో హౌసింగ్‌ ఉన్నతాధికారులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో నిర్మాణం ప్రారంభం కాని సుమారు 21 వేల ఇళ్లను కేంద్రం గృహ నిర్మాణ శాఖ రద్దు చేసింది. నాలుగేళ్ల క్రితం ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కింద జిల్లాలో గూడు లేని పేదలకు సుమారు 1.4 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలాలు కలిగిన వారిని, గూడు లేని నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. పేదల కోసం నగర శివారుల్లో ప్రభుత్వం అభివృద్ధి చేసిన లేఅవుట్‌లలో లబ్ధిదారుల తరపున కాంట్రాక్టర్లు నిర్మాణాలు ప్రారంభించారు. ఈ ఇళ్లన్నీ 2025 డిసెంబరు నెలాఖరు (తాజాగా గడువును ఈ ఏడాది సెప్టెంబరు వరకు పొడిగించారు)లోగా పూర్తిచేయాల్సి ఉంది. ఆ విషయాన్ని కేంద్రం పలుమార్లు స్పష్టం చేస్తూ వస్తోంది. అయితే కాంట్రాక్టర్లు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన 80 వేల ఇళ్లలో వివిధ కారణాలతో నాలుగో వంతు పనులు ప్రారంభించలేదు. పునాదుల్లో, మరికొన్ని పునాదులు నిర్మించి లోపల మట్టి పూడ్చని దశలో ఉన్నాయి. ఈ మూడు కేటగిరీలు కలిపి సుమారు 20 వేల వరకూ ఉంటాయని అంచనా. అదేవిధంగా సొంత స్థలాలు, ప్రభుత్వం అభివృద్థి చేసిన లేఅవుట్‌లలో మరో 1,000 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో మొత్తం 21 వేల ఇళ్లు గడువులోగా అంటే గత ఏడాది డిసెంబరు 31వ తేదీలోగా ప్రారంభించకపోవడంతో కేంద్రం రద్దు చేసింది. అయితే సెంటు భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు జియో ట్యాగ్‌ చేయకపోవడంతో ఎక్కువ ఇళ్లు రద్దయినట్టు చెబుతున్నారు. కేంద్ర గృహ నిర్మాణ శాఖ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణం ప్రారంభానికి ముందు లబ్ధిదారులను స్థలం వద్దకు తీసుకువెళ్లి జియో ట్యాగ్‌ చేయాలి. ఆ తరువాత పునాదులు (పునాదులు నిర్మించి దాంట్లో పూర్తిగా మట్టి నింపాలి) పూర్తిచేసిన తరువాత మరోసారి జియోట్యాగ్‌ చేస్తారు. అప్పుడు మాత్రమే మొదటి బిల్లు మంజూరుకు అవకాశం ఉంటుంది. కానీ పలు లేఅవుట్‌లలో పాక్షికంగా పునాదులు, కొన్నిచోట్ల పూర్తిస్థాయి పునాదులు నిర్మించినా జియో ట్యాగ్‌ చేయకపోవడంతో కేంద్రం వాటిని రద్దు జాబితాలో చేర్చిందని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తప్పుబడుతున్నారు. ఇదిలావుండగా జిల్లాలో 21 వేల ఇళ్లు రద్దు కావడంతో హౌసింగ్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ నుంచి పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్నారు. తాజాగా ఇళ్ల నిర్మాణాల పూర్తికి ఈ ఏడాది సెప్టెంబరు వరకూ గడువు పెంచిన నేపథ్యంలో పలు సాంకేతిక కారణాలతో రద్దు చేసిన 21 వేల ఇళ్లను పునరుద్ధరించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని యోచిస్తున్నారు.

Updated Date - Feb 28 , 2026 | 01:14 AM