Share News

20,688 మందికి దివ్యాంగ శక్తి

ABN , Publish Date - Mar 19 , 2026 | 01:42 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘దివ్యాంగ శక్తి’ పథకంతో జిల్లాలో 20 వేల మందికిపైగా దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు పథకాన్ని మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లతో కలిసి బుధవారం ప్రారంభించారు.

20,688 మందికి  దివ్యాంగ శక్తి

అమలులోకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం

మద్దిలపాలెం డిపోలో ప్రారంభించిన కలెక్టర్‌

హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ, విష్ణుకుమార్‌రాజు

40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి అవకాశం

విశాఖపట్నం/మద్దిలపాలెం,

మార్చి 18 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘దివ్యాంగ శక్తి’ పథకంతో జిల్లాలో 20 వేల మందికిపైగా దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు పథకాన్ని మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్ర్తీశక్తి పథకంతో మహిళలకు కలిగే ప్రయోజనాలన్నీ దివ్యాంగులకు అందుతాయన్నారు. గతంలో దివ్యాంగులకు కొన్ని బస్సుల్లోనే 50 శాతం రాయితీ ఉండేదని, ఇకపై సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, పల్లె వెలుగు, ఆల్ర్టా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునన్నారు. ఇంటర్‌ సర్వీస్‌లలో 50 శాతం రాయితీ ఉంటుందన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న 21 కేటగిరీల వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. 100 శాతం అంధత్వం, 69 శాతం ఐక్యూ ఉన్న మానసిక దివ్యాంగులకు సహాయకులుగా ఉన్న వారికి ఈ బస్సుల్లో టికెట్‌పై 50 శాతం రాయితీ లభిస్తుందన్నారు. జిల్లాలో 720 బస్సులు ఉండగా, 580 బస్సుల్లో స్ర్తీశక్తి, దివ్యాంగ శక్తి పథకాలు వర్తిస్తాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో లేని పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి దివ్యాంగుల్లో సంతోషం నింపిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక్కడ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ స్ర్తీశక్తి పథకంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు స్ర్తీ శక్తి పథకం అమలుచేశారని, ఇప్పుడు దివ్యాంగ శక్తి ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచే పథకాలు అమలుచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ వైద్య సేవాట్రస్ట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుధాకర్‌, ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కె.కవిత, ఆర్టీసీ అధికారి కె.పద్మావతి, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.

జిల్లాలో 20,688 మంది

జిల్లాలోని 20,688 మంది దివ్యాంగులకు ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యాన్ని కలిగి ఉన్న వారంతా అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది. వారికి ఇప్పటికే సదరం సర్టిఫికెట్లను జారీచేసింది. వాటి ఆధారంగానే పెన్షన్లు, ఇతర పథకాలను అందిస్తోంది. ఉచిత బస్సు పథకానికి కూడా దీనినే అర్హతగా పేర్కొంది. ఇప్పటివరకూ నాలుగు రకాల కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు మాత్రమే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించేవారు. ఇకపై 21 విభాగాల వారికి అవకాశం ఉంటుంది. ఇందుకు అవసరమైన డిజిటల్‌ పాస్‌లను మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ యాప్‌, ఏపీఎస్‌ఆర్టీసీ యాప్‌తో పాటు నేరుగా ఆర్టీసీ కార్యాలయాల్లో పొందవచ్చు. సదరం పత్రాన్ని యాప్‌తో అనుసంధానించి, క్యూఆర్‌ కోడ్‌తో డిజిటల్‌ పాస్‌లు జారీచేస్తామని అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లలోని కౌంటర్లలో కూడా పాస్‌లు జారీచేస్తారు. ఇందుకోసం ఆధార్‌కార్డు, సదరం సర్టిఫికెట్‌, పాస్‌పోర్టు సైజ్‌ఫొటో అందించాలి. వన్‌టైమ్‌ వెరిఫికేషన్‌ అనంతరం పాస్‌లు ఇస్తారు.

Updated Date - Mar 19 , 2026 | 01:43 AM